దేశంలో అభివృద్ధి మొత్తం నగరాల చుట్టూనే కేంద్రీకృతం అవుతోంది. దీంతో పెద్దసంఖ్యలో ప్రజలు పట్టణాలకు వలస వస్తున్నారు. ఉద్యోగాలు, ఏదో ఒక ఉపాధిలో కుదురుకుని జీవితం గడుపుతున్నారు. వారిలో అల్ప, మధ్య ఆదాయ వర్గాలు సొంత ఇల్లు సమకూర్చుకోలేకపోతున్నారు. మొత్తానికి సొంత ఇల్లుకల కలలాగే మిగిలిపోతోంది. నగరాల్లో అందుబాటు ధరల్లో ( రూ.40 లక్షల లోపు ) ఇళ్లు క్రమంగా తగ్గిపోతున్నాయి.
మిడ్ ఎండ్ ( రూ.40–80 లక్షలు ) గృహాల విషయంలోనూ ఇదే ధోరణి నెలకొంది. వాటి స్థానాన్ని హై -ఎండ్ ( రూ.80 లక్షలు-రూ.1.5 కోట్లు), లగ్జరీ ( రూ.1.5 - 2.5 కోట్లు ), అల్ట్రా లగ్జరీ ( రూ.2.5 కోట్లకు పైగా ) ఇళ్లు ఆక్రమిస్తున్నాయి. 2019, 2024లో పట్టణ భారతంలో ఆయా విభాగాలవారీగా నీతి ఆయోగ్ ఆధారంగా చూస్తే చౌకధరల్లో ఇళ్లు 2019లో 40 శాతం అందుబాటులోకిరాగా 2024లో ఆ సంఖ్య 16 శాతంగా ఉన్నాయి.
మిడ్ ఎండ్ ఇళ్లు 2019 లో 33 శాతం ఉన్నాయి. 2024 కు వచ్చేసరికి అది 28 శాతం వద్ద ఉంది. హై ఎండ్ విభాగంలో 2019లో 16శాతం ఉండగా 2024కు 26 శాతానికి పెరిగింది. లగ్జరీ ఇళ్లు 2019లో ఏడు శాతం ఉంటే 2024 నాటికి రెట్టింపు అయింది. అల్ట్రా లగ్జరీ ఇళ్ల కొనుగోలులో మాత్రం భారీ వ్యత్యాసం కనిపించింది. 2019లో నాలుగుశాతం ఉంటే 2024లో ఏకంగా 16 శాతానికి పెరిగింది.
భారంగా ఇళ్ల నిర్మాణం ఖర్చు
సామాన్య, మధ్యతరగతివాసుల కల సాకారంచేసే చౌక ఇళ్లకు నిర్మాణ ఖర్చు భారంగా మారుతోంది. దేశంలో దశాబ్దకాలంలో నిర్మాణ వ్యయం చాలా పెరిగింది. ద్రవ్యోల్బణం, నైపుణ్య కార్మికుల జీతభత్యాలు, లాజిస్టిక్స్ కొరత, ఇంధన ధరల పెరుగుదల, ముడిపదార్ధాల సరఫరాలో అంతరాయాలు, మౌలిక సదుపాయాలకు గిరాకీ పెరగడం, ప్రపంచవ్యాప్తంగా స్థూల, ఆర్థిక ఒడిదుడుకులు, ప్రభుత్వ విధానాలు వంటి కారణాలతో 2021 నుంచి నిర్మాణ వ్యయం పెరిగింది.
ఈ కారణంగా ఇళ్ల ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇంచుమించు అన్ని అంశాల్లోనూ పెరుగుదల స్పష్టంగా ఉన్నందున చౌకగా ఇళ్లు లభిస్తాయని అనుకోవడం భ్రమగానే మిగిలిపోతుందేమోన్న అనుమానం వెంటాడుతోంది. సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కలలు కనే సామాన్యుల్లో కొందరు నెరవేర్చుకుంటారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికీ ఇల్లు కట్టుకోవాలంటే ముందూ వెనుక ఆలోచించే పరిస్థితి ఉంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతవరకూ అండగా నిలుస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద కేంద్రం నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్య తరగతి వర్గాల కోసం కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండే అవకాశం ఉంది. 16 రాష్ట్రాలు లబ్ధి పొందనున్నాయి.
పట్టణ పేదల సొంత ఇంటి కలను నిజం చేసేది ఈ పథకం. 2.50 లక్షల ఆర్థిక సాయంతో ఇల్లు సమకూర్చుకునే అవకాశం ఉంది. దేశం మొత్తం మీద ఐదు లక్షల రూపాయలతో ఏడాదికి నాలుగున్నర లక్షల ఇళ్లు చొప్పున నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది.
ఇళ్ల పథకాల్లో కేంద్రం ఇస్తున్న నిధులతోనే మిగతా రాష్ట్రాలు సరిపెడుతుండగా, తెలంగాణలో పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఐదు లక్షల రూపాయలతో 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఇళ్లను లబ్ధిదారులే నిర్మించుకునేలా పథకాన్ని రూపొందించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉండటంతో ప్రభుత్వం అలాంటి వారందరికీ పదంతస్తుల భవనాల్లో రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇస్తున్నది.
- జి. యోగేశ్వరరావు,జర్నలిస్ట్
