సంగారెడ్డి జిల్లా సదాశివపేట NH 65పై బైపాస్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ శివారులోని మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ, బస్సు నుజ్జునుజ్జు అయ్యాయి.
ప్రమాదం జరగ్గానే బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సహాయంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడ్డ వారిని అంబులెన్స్ లో సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి లారీ డ్రైవర్ అతి వేగమే కారణమని తెలుస్తోంది.
ఈ రోడ్డు ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు బస్సును, లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
