రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందనల కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. తాజాగా వీరిద్దరూ నిజజీవితంలోనూ ఒక్కటవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం ఈ క్రేజీ కపుల్ జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
“ఎందయ్య సామి” సాంగ్ రిలీజ్
లేటెస్ట్ గా ఈ నూతన వధూవరులకు విషెస్ చెబుతూ ‘రణబాలి’ చిత్రబృందం ఒక మధురమైన కానుకను అందించింది. ఈ సినిమాలోని మొదటి సింగిల్ “ఎందయ్య సామి” సాంగ్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది. అజయ్-అతుల్ స్వరపరిచిన ఈ పాట వినగానే మనసును హత్తుకునేలా ఉంది. జానపద బాణీలు, ఆధునిక మెలోడీ మేళవింపుతో సాగే ఈ పాటలో విజయ్, రష్మికల మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. ఈ పాటను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు.
హాలీవుడ్ టచ్..
రౌడీ స్టార్ ‘రణబాలి’గా మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, రష్మిక ‘జయమ్మ’గా పల్లెటూరి పడచు పాత్రలో మెరిసిపోతోంది. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే ‘గీత గోవిందం’ నాటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కాబోతోందని అర్థమవుతోందంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే.. ప్రపంచ ప్రఖ్యాత ‘ది మమ్మీ’ సినిమా విలన్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన రాకతో ఈ సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరింది.
విడుదల ఎప్పుడు?
ఒకవైపు యాక్షన్, మరోవైపు విజువల్ గ్రాండియర్ ఉన్న ఈ కథలో రొమాంటిక్ యాంగిల్ కూడా బలంగా ఉండబోతోంది. ‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11న భారీ ఎత్తున థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తానికి, పెళ్లి తర్వాత విజయ్-రష్మిక కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడం, దానికి తోడు రాహుల్ సంకృత్యన్ మేకింగ్ స్టైల్ తోడవడంతో ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
