ప్రతి ఏడాది ఫిబ్రవరి 28న మనం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజు సీవీ రామన్ 1928లో కనుగొన్న రామన్ ప్రభావాన్ని స్మరించుకునే రోజు. పాఠశాలలలో కాంతి పరిక్షేపణం (స్కాటరింగ్ ఆఫ్ లైట్) ప్రయోగాలు చూపిస్తారు. విద్యాసంస్థలు ‘ఇన్నోవేటర్లను’ సత్కరిస్తాయి. ప్రసంగాలు భారతీయ విజ్ఞాన వారసత్వాన్ని ప్రశంసిస్తాయి. కానీ, మనం వైజ్ఞానిక ఆవిష్కరణల ఉత్సవాలకే పరిమితం అవుతున్నామా? లేక శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే పనులను చేస్తున్నామా? ఈ ప్రశ్నలు రెండింటి మధ్య తేడా ఈ రోజుల్లో అత్యంత ప్రాముఖ్యమైనది. రామన్ ప్రభావం కేవలం ఒక ప్రయోగాత్మక విజయమే కాదు. పదార్థంతో పరస్పర చర్య జరిపినప్పుడు కాంతి తరంగదైర్ఘ్యం స్వల్పంగా మారుతుందని ఆయన నిరూపించారు. అణువులకు అంతర్గత కంపన స్థితులు ఉన్నాయని రామన్ ప్రభావం వెల్లడించింది. పదార్థానికి ఒక అంతర్గత శక్తి నిర్మాణం ఉందని నిరూపించింది. ఈ ఆవిష్కరణే రామన్‌కు నోబెల్ బహుమతిని తెచ్చి పెట్టింది.
లైనస్ పౌలింగ్ కూడా తప్పక మన స్మరణలోకి వస్తారు. ఫిబ్రవరి 28 రోజున ఆయన జన్మించారు. రసాయన బంధాల స్వభావాన్ని, హైబ్రిడైజేషన్ భావనను, ఎలక్ట్రోనెగటివిటీ స్కేల్‌ను అభివృద్ధి చేసి రసాయన శాస్త్రాన్ని సంపన్నం చేశారు. అణువులలో బంధాల స్వరూపం, వాటి ఆకృతి ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్నలకు తర్కబద్ధ సమాధానాలు ఇచ్చారు. ఆయన విజ్ఞాన శాస్త్రానికి ఒక నైతిక కోణాన్ని జోడించారు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అణ్వస్త్రాల ప్రమాదాన్ని గుర్తించి, అణుపరీక్షలకు వ్యతిరేకంగా వేలాదిమంది శాస్త్రవేత్తలను సమీకరించారు. పదకొండు వేల మంది శాస్త్రవేత్తలతో సంతకాలు చేయించి అణుపరీక్షలకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టారు. ప్రభుత్వ ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. మానవతా విలువల పక్షాన నిలబడ్డారు. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతితోపాటు, శాంతి నోబెల్ బహుమతి కూడా పొందారు.
శాస్త్రీయ దృక్పథం పెరుగుతోందా?
ఈ రోజుల్లో విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కృత్రిమ మేధస్సు, జీవసాంకేతికత, అణుశక్తి ఇవన్నీ అపారమైన అవకాశాలను, అలాగే అపారమైన ప్రమాదాలను కలిగి ఉన్నాయి. సాంకేతికత పెరుగుతోంది. కానీ, శాస్త్రీయ దృక్పథం పెరుగుతోందా? సామాజిక మాధ్యమాల్లో అసత్య సమాచారం వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో రామన్, పౌలింగ్ జీవితాలు... మనకు సత్యాన్వేషణకు భయపడకూడదు, సత్యం తెలిసిన తర్వాత మౌనంగా ఉండకూడదు అనే రెండు పాఠాలను చెబుతాయి.
విజ్ఞానం సమగ్రం కావాలంటే ఆవిష్కరణ, సామాజిక చైతన్యం రెండూ సమైక్యపరచాలి. జాతీయ విజ్ఞాన దినోత్సవం కేవలం ఒక చారిత్రక ఘట్టాన్ని స్మరించుకునే రోజు కాకూడదు. అది మన విద్యా వ్యవస్థను, మన మేధో సంస్కృతిని, మన సామాజిక బాధ్యతను ప్రశ్నించే రోజు కావాలి. రామన్ కాంతితో అణువుల అంతర్గత నిర్మాణాన్ని చూపించారు. పౌలింగ్ తర్కంతో అధికార నిర్మాణాన్ని ప్రశ్నించారు. అణ్వస్త్రాల ఆధునికీకరణ కొనసాగుతోంది. కృత్రిమ మేధస్సు యుద్ధ వ్యవస్థలలోకి ప్రవేశిస్తోంది. జీవసాంకేతికత వైద్యంకోసం ఉపయోగపడగలదు. అలాగే ప్రమాదకర ప్రయోజనాలకూ దారితీయగలదు. సమాచార యుద్ధం.. నిజం–అబద్ధం మధ్య సరిహద్దులను చెరిపేస్తోంది. మనిషి జ్ఞానం విస్తరించింది. కానీ, జ్ఞానానికి తోడు నైతిక విజ్ఞానం పెరిగిందా?
క్షీణిస్తున్న మానవీయ కోణం
ప్రయోగశాలలు అభివృద్ధి చెందుతున్నాయి, కానీ, మానవీయ కోణం క్షీణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఎప్స్టీన్ ఫైల్స్’ ఘటన.. కేవలం ఒక వ్యక్తి కథ కాదు. అధికారం, సంపద, మౌనం కలిసి బాధ్యతను ఎలా వక్రీకరించగలవో చూపించిన ఉదాహరణ. శాస్త్రీయ దృక్పథం అంటే ఋజువులు, పరిశీలన, నిర్భయ ప్రశ్నలు. అధికారానికి భయపడే సంస్కృతి పెరిగితే, ప్రశ్నించే స్వభావం క్షీణిస్తుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ విమర్శనాత్మక దృష్టి లేని సమాజం ప్రమాదకరం.
ఈ రోజుల్లో జ్ఞానం, నైతికత, సామాజిక బాధ్యతల మధ్య ప్రమాదకర విభజన కనిపిస్తోంది. రామన్ జ్ఞానాన్ని విస్తరించారు. పౌలింగ్ నైతిక బాధ్యతను నొక్కిచెప్పారు. ఇప్పటి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిధులు, రాజకీయ ప్రయోజనాలు, కార్పొరేట్ ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నారు. ప్రచురణలు, పేటెంట్లు, ప్రతిష్ట ఇవే ప్రధాన లక్ష్యాలైపోతే విజ్ఞానం సామాజిక బాధ్యత వెనకబడుతుంది. ప్రమాదమని తెలిసికూడా మౌనంగా ఉండటం తటస్థత కాదు. అది ప్రమాదానికి సహకరించడం అని పౌలింగ్ జీవితం మనకు చెబుతుంది.
విజ్ఞానానికి నైతిక ధైర్యం అవసరం
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ‘శాస్త్రీయ దృక్పథం, మానవతా భావం, పరిశోధనా స్పూర్తి’ పెంపొందించాలని సూచిస్తుంది. కానీ, నేటి పరిస్థితుల్లో అవాస్తవాలను సంస్కృతి పేరుతో ప్రాచుర్యం చేస్తున్నారు. నిపుణులను పక్కన పెడుతున్నారు. సామాజిక మాధ్యమాలు అసత్య సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చేస్తున్నాయి. జాతీయ విజ్ఞాన దినోత్సవం ఒక వేడుకగా కాకుండా ఒక ఆత్మపరిశీలనగా మారాలి. వనరులు పరిమితమైనా, ఆలోచన పరిమితం కావద్దు, కచ్చితత్వం గొప్పతనానికి మార్గం, స్వతంత్ర ఆలోచన అవసరం, ఇవి రామన్ మనకు నేర్పింది.
విజ్ఞానం నైతిక బాధ్యతతో కలిసినప్పుడే సంపూర్ణం అవుతుంది, జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం కేవలం ఒక నోబెల్ విజేతను స్మరించుకోవడం మాత్రమే అయితే, అది ఒక చారిత్రక స్మృతి వేడుకగా మిగిలిపోతుంది. అది శాస్త్రీయ దృక్పథాన్ని పునరుద్ఘాటించే పౌర ఉద్యమంగా మారితే దానికి నిజమైన అర్థం ఉంటుంది. రామన్ కాంతితో పదార్థంలోని నిగూఢ కంపనాలను వెలికితీశారు. పౌలింగ్ తర్కంతో అధికారంలోని నిగూఢ ప్రమాదాలను చూపించారు. సాంకేతికంగా వేగంగా దూసుకుపోతున్న ప్రపంచంలో కేవలం ఆవిష్కరణ సరిపోదు. విజ్ఞానంతోడు నైతిక ధైర్యం అవసరం. ఈ ఫిబ్రవరి 28న కేవలం కాంతి పరిక్షేపణ గురించి మాత్రమే కాదు.. అజ్ఞాన పరిక్షేపణ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రయోగశాలలనే కాదు నిర్భయ మేధస్సులను నిర్మిద్దాం.
శాస్త్రవేత్తలు సామాజిక చైతన్యానికి సాక్షులు
ప్రయోగశాల చిన్నదైనా ప్రశ్న పెద్దదై ఉండాలని రామన్ మనకు నేర్పాడు. శాస్త్రవేత్తలు కేవలం సాంకేతిక నిపుణులు కాదు. సామాజిక చైతన్యానికి సాక్షులు అని పౌలింగ్ నిరూపించాడు. పదార్థం అంతర్గత నిర్మాణం ఏమిటి? అనే మూలప్రశ్నలపై ఆసక్తి, ఆమోదించిన సిద్ధాంతాలను ప్రశ్నించే ధైర్యం, మేధో స్వాతంత్ర్యం, పరిశోధనా సంస్కృతిని పెంపొందించడంలాంటి సామ్యాలు రామన్, పౌలింగ్ ఇద్దరిలోనూ కనిపిస్తాయి. వీరిద్దరిలో ఒక ముఖ్యమైన తేడా కూడా ఉంది. రామన్ ప్రధానంగా విజ్ఞాన రంగానికే కట్టుబడి ఉన్నారు. పౌలింగ్ విజ్ఞానాన్ని సమాజంతో, రాజకీయాలతో, నైతిక బాధ్యతతో కలిపారు. ఈ తేడా వర్తమాన కాలంలో శాస్త్రవేత్తలు, తమ బాధ్యతను ఎలా నిర్వర్తించాలి? అనే ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వగలుగుతుంది.
- ఎడమ శ్రీనివాస రెడ్డి, కెమిస్ట్రీ లెక్చరర్,కాకతీయ గవర్నమెంట్ కాలేజ్, హన్మకొండ
