మన ఉద్యోగాలను భారతీయులు, పాకిస్థానీలు లాక్కుంటున్నారు: యూకే ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు

మన ఉద్యోగాలను భారతీయులు, పాకిస్థానీలు లాక్కుంటున్నారు: యూకే ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు

లండన్: యూకేలోని భారతీయ, పాకిస్తానీ వలసదారులపై బ్రిటిష్ స్వతంత్ర ఎంపీ ఎంపీ రూపెర్ట్ లోవ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయులు, పాకిస్తానీలు బ్రిటిష్ పౌరుల ఉద్యోగాలను లాక్కోవడంతో పాటు దేశ సాంస్కృతిక గుర్తింపును మారుస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల కారణంగా తనకు  జాత్యహంకారిగా ముద్రపడ్డ ఎలాంటి ప్రాబ్లమ్ లేదన్నారు. వలసల కారణంగా వాయువ్య ఇంగ్లాండ్‌లోని కొన్ని ప్రాంతాలు విదేశాలుగా మారిపోయాయని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాన బ్రిటిష్ పార్టీలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి లక్షలాది మంది తక్కువ నైపుణ్యం గల వలసదారులను దేశంలోకి అనుమతిస్తున్నాయని విమర్శించారు. ఇంగ్లాండ్‎లోని కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా పెరుగుదలపైన లోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. మాంచెస్టర్‌లోని చాలా ప్రాంతాలు ఇస్లామిక్‎గా మారుతున్నాయని ఆరోపించారు. బుర్ఖాలు, షరియా కోర్టులు, హలాల్ వధ, బహిరంగ ప్రార్థనా సమావేశాలను తీవ్రంగా విమర్శించారు. 

తమ రిస్టోర్ బ్రిటన్ పార్టీ అధికారంలోకి వస్తే  హిజాబ్‎ను నిషేధించడంతో పాటు బహిరంగ ప్రదేశాలలో కిర్పాన్‌ను బ్యాన్ చేస్తామని హామీ ఇచ్చారు. బ్రిటిష్ మహిళలు సొంత దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో సౌకర్యవంతంగా ఉండకలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్లాయని అన్నారు. రూపెర్ట్ లోవ్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. కొందరు అతడి వ్యాఖ్యలతో ఏకీభవిస్తుండగా.. ఇంకొందరు తీవ్రంగా విభేదిస్తున్నారు. వలసదారులు, ముస్లిం వర్గాలపై లోవ్ చేసిన వ్యాఖ్యలు జాతి, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు.