సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు: వైసీపీ నేత నాగార్జున యాదవ్‌కు 14 రోజుకు రిమాండ్

సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు: వైసీపీ నేత నాగార్జున యాదవ్‌కు 14 రోజుకు రిమాండ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషించిన కేసులో నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో వైసీపీ నేత నాగార్జున యాదవ్ విచారణ ముగిసింది. నాగార్జున యాదవ్‌కు కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్ట్ ప్రక్రియలో పోలీసులు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించలేదని నాగార్జున యాదవ్ తరఫు న్యాయవాదులు వాదించారు.

వాదనలు విన్న నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించడంతో తదుపరి న్యాయ పోరాటంపై YSRCP వర్గాలు, న్యాయవాదులు దృష్టి సారించాయి. నాగార్జున యాదవ్ను 14 రోజుల రిమాండ్ నిమిత్తం చంచల్ గూడ జైలుకు తరలించారు. బెయిల్ కోసం మళ్లీ కోర్టుకు వెళ్లాలని నాగార్జున యాదవ్ తరపు అడ్వకేట్స్ భావిస్తున్నారు.

ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానెల్ లైవ్ డిబేట్లో నాగార్జున యాదవ్ మాట్లాడుతూ..  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్ అంటూ.. దేశంలోనే అత్యంత దారుణంగా ఒక డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి అయ్యాడంటూ సెటైర్లు వేశారు.

►ALSO READ | రీజనల్ రింగ్ రోడ్డుపై అఖిల పక్ష సమావేశంలో సీఎం కీలక ప్రకటన

అంతేకాదు, రేవంత్ రెడ్డికి ప్రభుత్వ జీవోలు చదవడం కూడా రాదంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిపై ఈ విధమైన కించపరిచే వ్యాఖ్యలు చేయడంపై టీపీసీసీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ కైలాష్ సజ్జన్ ఇచ్చిన ఫిర్యాదుతో బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గుంటూరులోని నాగార్జున యాదవ్ నివాసానికి వెళ్లిన తెలంగాణ పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు.