ప్రజల జోబుల్లోకి కొత్తరకం కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయ్.. రిజర్వు బ్యాంక్ నయా ప్లాన్

ప్రజల జోబుల్లోకి కొత్తరకం కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయ్.. రిజర్వు బ్యాంక్ నయా ప్లాన్

మన జేబుల్లో నిగనిగలాడే కొత్త నోట్లు త్వరలో సరికొత్త రూపంలో దర్శనమివ్వబోతున్నాయా? అవుననే అంటున్నాయి బ్యాంకింగ్ వర్గాలు. దేశంలో నగదుకు డిమాండ్ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండటంతో.. సంప్రదాయ కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్లీ కసరత్తులు ప్రారంభించింది. ఇటీవల పాట్నా, ముంబైలలో జరిగిన బోర్డు సమావేశాల్లో ఈ విషయంపై తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ప్లాస్టిక్ నోట్లెందుకు?
కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ అంటే ప్లాస్టిక్ నోట్లను ముద్రించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. పైగా ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి. చినిగిపోవడం, నీటిలో నాని పాడైపోవడం వంటి సమస్యలు ఉండవు. ప్రస్తుతానికి దేశంలోని ఏటీఎంలను కూడా ఈ ప్లాస్టిక్ నోట్లను పంపిణీ చేసేలా మార్పులు చేయవచ్చని, అందుకు తగిన సాంకేతికత మన వద్ద ఉందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై ఒక పైలట్ ప్రాజెక్టును కూడా ఆర్బీఐ ప్రకటించే అవకాశం ఉంది.

డిజిటల్ పేమెంట్లు ఎంత పెరిగినా.. చేతిలో నగదు వాడకం మాత్రం తగ్గడం లేదు. మే 15 నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ రికార్డు స్థాయిలో రూ.42.86 ట్రిలియన్లకు చేరింది. మరోవైపు నోట్ల ముద్రణ ఖర్చు ఆర్థిక సంవత్సరం 2025లో రూ.6వేల 373 కోట్లకు పెరిగింది. అలాగే పాడైపోయిన నోట్లను మార్చడం ఆర్బీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. గత ఏడాదిలోనే సుమారు 23.8 బిలియన్ల పాత నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. ఇందులో 500, 100 నోట్లే ఎక్కువగా ఉన్నాయి.

మార్కెట్లో 10, 20 నోట్లకు డిమాండ్ భారీగా ఉన్నప్పటికీ.. మొత్తం కరెన్సీ విలువలో వీటి వాటా కేవలం 0.7%, 0.8% మాత్రమే. కాగితపు చిన్న నోట్లు త్వరగా పాడైపోతుండటంతో వాటి స్థానంలో నాణేల వాడకాన్ని పెంచాలని ఆర్బీఐ ప్రయత్నించింది. కానీ ఆశించిన ఫలితం రాలేదు. నిజానికి 2012లోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐదు నగరాల్లో 10 ప్లాస్టిక్ నోట్లను ట్రయల్ రన్ కింద చెలామణి చేయాలని చూసింది. కానీ సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అప్పట్లో ఆగిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ మారడంతో.. మరింత పక్కాగా ప్లాస్టిక్ నోట్లను మార్కెట్లోకి తెచ్చి నోట్ల ముద్రణ భారాన్ని, కరెన్సీ వృథాను తగ్గించాలని ఆర్బీఐ గట్టి పట్టుదలతో ఉంది. అందువల్లనే త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ప్రజల చేతుల్లోకి విడుదల చేయాలని ప్రయత్నిస్తోంది.