కేబుల్ చానళ్ల ప్రతినిధులకు అక్రెడిటేషన్లు ఇవ్వాలి : టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

కేబుల్ చానళ్ల ప్రతినిధులకు  అక్రెడిటేషన్లు ఇవ్వాలి : టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ టీవీ న్యూస్ చానళ్లలో పని చేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. సోమవారం సెక్రటేరియేట్​లో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ముకుంద రెడ్డికి వినతిపత్రం అందించారు. అక్రెడిటేషన్లు అర్హులైన చాలా మందికి అందలేదని, కేబుల్ చానళ్లకు సంబంధించిన జర్నలిస్టులకు ఒక్క కార్డు కూడా ఇవ్వలేదన్నారు. జిల్లా కేంద్రంలో స్టూడియో ఉండాలన్న నిబంధనను సడలిస్తూ సర్క్యులర్ జారీ చేయాలని కోరారు. 

ఎంఐబీ రిజిస్ట్రేషన్ తో ఐపీ బాక్స్ ల ద్వారా నడుస్తున్న అన్ని చానళ్లకు కార్డులివ్వాలన్నారు. ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్​కుంచం శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ వి.రవికుమార్, కో-కన్వీనర్ ఆర్.శ్రీనివాస్ గౌడ్, కేబుల్ ఛానళ్ల ప్రతినిధులు మహ్మద్ షఫీవుద్దీన్, జీవన్ కుమార్ గౌడ్, ఫారూఖ్ పటేల్, జూలూరు సత్యం గౌడ్ పాల్గొన్నారు.