హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలోని డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగ భద్రతపై ఆర్టీసీ యాజమాన్యం 8 మంది అధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేసింది. ఈ కమిటీలో ఆర్టీసీ ఈడీలు శ్రీధర్, కుస్రో షాహ్ ఖాన్, సీటీఎం శ్రీదేవి, రీజనల్ మేనేజర్లు (ఆర్ఎంలు) సుచిత్ర, రాజు, డిప్యూటీ ఆర్ఎం భూపతిరాజు, డిపో మేనేజర్లు ఉపేందర్, సుఖేందర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించిన పలు కీలక అంశాలను ఈ కమిటీ సభ్యులు అధ్యయనం చేసి, త్వరలోనే యాజమాన్యానికి తగిన సలహాలు, సూచనలు అందజేయనున్నారు.
