భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత, విశిష్టత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒకే భాష, వస్త్రధారణ, ఆభరణాలు, జానపద కళారూపాలు, సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన కోట్లాది మంది బంజారాలు వివిధ ప్రాంతాలలో అనుసరించిన వృత్తిరీత్యా లంబాడీ, సుగాలి, లబానా, బాజిగర్, ధన్కుడి, రోమా, జిప్సీ తదితర పేర్లతో గుర్తించిన బంజారాలు ప్రాచీన గిరిజన తెగలో ఒకరు.
బంజారాలు కాలానుగుణ పరిస్థితుల ప్రభావం వల్ల సంచార జీవనానికి స్వస్తి పలికి, నేడు దేశంలో దాదాపు 10 కోట్ల మంది బంజారాలు 23 రాష్ట్రాలలో ‘తండాల’ పేరుతో స్థిర నివాసాలు ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి ఘోర తపస్సు, వ్రతాచరణ ఫలితంగా పరమశివుడిని భర్తగా పొందిన రోజును ‘తీజ్ దివస్’ గా పాటిస్తున్నారు. ఆదిమ బంజారాలు ఈ పరిణామాన్ని అవకాశంగా చేసుకొని పెళ్లిళ్లు కావలసిన ఆడపిల్లలు తీజ్ పేరుతో తొమ్మిది రోజుల ఉత్సవాన్ని చేసుకుంటారు. ‘తీజ్’ అంటే హరియాలి (పచ్చదనం), నిండుదనం, అష్టైశ్వర్యాలకు మూలం, శుభాలకు సౌభాగ్యానికి, సుభిక్షానికి ప్రతీక అని అర్థం.
సీత్లా భవాని పూజ
తీజ్ ఉత్సవానికి మూలమైన సీత్లా భవాని పూజను జులై మాసంలో ఒక మంగళవారం నిర్వహిస్తారు. ఆ రోజు తండా వాసులు వనభోజన పద్ధతిలో తండాకు దూరంగా వెళ్లి ఒక చెట్టు కింద రాయిని సీత్లా భవాని ప్రతిరూపంగా ప్రతిష్ఠించి సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. బంజారా సమాజం, పంటలు, పశుపక్ష్యాదులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తారు. అదేరోజు సాయంత్రం తండా నాయకుని ఇంటి వద్ద ఒక బిందెలో గోధుమలను నానబెడతారు. మరుసటి రోజు వెదురుతో తయారు చేసిన చిన్న కంకబుట్టలలో ఎరువు వేసి గోధుమలను చల్లుతారు. అలాగే దండి మేరామా మాత, సద్గురు శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ పేర్లతో టేకాకు దొప్పలలో కూడా గోధుమలను నాటుతారు. ఆ కంకబుట్టలను నాయక్ ఇంటి ముందు ఏర్పాటుచేసిన చిన్న డేరాలో లేదా పందిరిపై ఉంచుతారు. వరసలు కలిగిన ఇద్దరు పెళ్లికాని ఆడపడుచులు పూజారిణులుగా బాధ్యతలు నిర్వహిస్తూ, కఠిన నియమ నిష్ఠలను పాటిస్తారు.
గణ్ గోర్ డమోళి
తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఆడపడుచులు ఆటపాటలతో సమీపంలోని చెరువు లేదా బావి నుంచి మూడు పర్యాయాలు నీటిని తీసుకువచ్చి కంకబుట్టలలో పోస్తూ గోధుమలను పెంచుతారు. ప్రతిరోజు సాయంత్రం గోర్ పరివార్ సభ్యులు జానపద గేయాలు, నృత్యాలు, సాంప్రదాయ కళారూపాలను ప్రదర్శిస్తూ ఉత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
పుట్టమట్టితో ఆడ, మగ రూపాల్లో గణ్ గోర్ విగ్రహాలను తయారు చేస్తారు. డమోళి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఇంటినుంచి బెల్లం, నెయ్యితో తయారుచేసిన చూర్మో, మోయి, లాప్సి వంటి తీపి పదార్థాలను వెడల్పాటి పాత్ర (కాకొటి)లో తీసుకొస్తారు. కాకొటిపై అద్దాలు, గవ్వలు, పూసలతో అలంకరించిన వస్త్రాన్ని కప్పి, నెత్తిపై ప్రత్యేకంగా చుట్టిన పులెరో గోణోపై ఉంచుకొని ఇంటింటికి తిరుగుతూ ఆ తీపి పదార్థాలను పంచుకుంటారు. అనంతరం తీజ్ ప్రదేశంలో అందరూ కలిసి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు.
నిమజ్జనం
తొమ్మిదవ రోజు గురువారం ఉదయం దండి మేరామా మాతకు, సద్గురు శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్‌కు ప్రత్యేక పూజలు సమర్పించి, కంకబుట్టలను పందిరి నుంచి కిందకు దింపుతారు. సాయంత్రం వరకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు (పామణ్)తో కలిసి నాచేరో, దండా మారేరో వంటి సంప్రదాయ జానపద నృత్యాలు, సాంస్కృ తిక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహిస్తారు.
సాయంత్రం గోధుమ నారుతో పచ్చగా పెరిగిన తీజ్ కంకబుట్టలను ఎవరివి వారు తలపై ధరించి, ఆటపాటలతో ఊరేగింపుగా చెరువు వరకు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం అనంతరం పెళ్లికాని ఆడపడుచులను చిన్న పీట (పిడియా)పై కాళ్ళుబెట్టి వారి సోదరులు పాదాలను కడిగి నమస్కరిస్తారు. అనంతరం వెంట తీసుకువెళ్లిన సద్ది రొట్టెలను ప్రసాదంగా భుజించి, అందరూ తమ తమ ఇళ్లకు చేరుకోవడంతో తొమ్మిది రోజుల తీజ్ ఉత్సవం ముగుస్తుంది. తొమ్మిది రోజుల పాటు నియమ నిష్ఠలతో ఈ వ్రతాన్ని ఆచరించిన బంజారా యువతులు అపారమైన భక్తి, ఆనందాన్ని పొందుతారు. పెళ్లికాని ఆడపడుచులు నిమజ్జనం సందర్భంగా భావో ద్వేగానికి గురవడం తీజ్ ఉత్సవంలోని ప్రత్యేకత.
తీజ్ పండుగకు అధికారిక గుర్తింపు కల్పించాలి
తీజ్ ఉత్సవంలో ఏర్పాటు చేసే కంకబుట్టల సంఖ్య తండాలోని, అలాగే పండుగకు హాజరయ్యే బంధువుల పెళ్లికాని ఆడపడుచుల సంఖ్యకు సమానం. ప్రతి కంక బుట్ట ఒక పెళ్లికాని కన్యకు ప్రతిరూపంగా భావిస్తూ ఆమె శుభ భవిష్యత్తు, సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు, బంజారా సమాజ సంక్షేమానికి ప్రతీకగా పూజిస్తారు. తొమ్మిది రోజుల తీజ్ వ్రతాన్ని ఆచరించే పెళ్లికాని ఆడపడుచులు కూడా మంచి జీవిత భాగస్వామి లభించాలని దేవతలను, ప్రకృతిని ప్రార్థిస్తారు. తెలంగాణలో సుమారు 35 లక్షల మంది బంజారాలు జరుపుకునే ఈ విశిష్టమైన తీజ్ పండుగకు ఇప్పటికీ తగిన ప్రభుత్వ గుర్తింపు లభించలేదు. ఆర్థిక ఇబ్బందులు, అవగాహనా లోపం కారణంగా అనేక తండాల్లో ఈ ఉత్సవం క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. బంజారాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తీజ్ పండుగను పరిరక్షించే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని తీజ్ పండుగకు అధికారిక గుర్తింపు కల్పిస్తుందని బంజారా సమాజం ఆశాభావంతో ఎదురు చూస్తోంది.
- ప్రొ.అజ్మీర సీతారాం నాయక్
మాజీ ఎంపీ,ఆల్ ఇండియా బంజారాసేవాసంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
