ఈ సారి కుంభవృష్టి..రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి

ఈ సారి కుంభవృష్టి..రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి
  • అగ్నిప్రమాదాలు, జన నష్టం జరగొచ్చు
  • అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచన 
  • కొత్త విగ్రహం పెడతామని మాట తప్పారని ఆగ్రహం

పద్మారావునగర్, వెలుగు :  రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే లష్కర్ బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలకమైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న 'రంగం' భవిష్యవాణి ఘట్టం సోమవారం భక్తి శ్రద్ధల నడుమ జరిగింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణంలో పచ్చి మట్టి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి ఆవహింపుతో భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది రాష్ట్రంలో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఊహించని రీతిలో వర్షాలు కురిసి వరదలు సంభవించే ప్రమాదం ఉందని.. తద్వారా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు, పాలకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటితో పాటు అగ్నిప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమలు, నివాస ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కాగా, ఈ సారి భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట అంశాలపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను కోరిన విగ్రహ ప్రతిష్ట కార్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ధర్మ మార్గంలో నడుచుకునే వారిని, నిబద్ధతతో పూజించే వారిని తాను ఎల్లప్పుడూ ఆదుకుంటానని మాతంగి స్వర్ణలత తెలిపారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను వీక్షించేందుకు హైదరాబాద్ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేలాది సంఖ్యలో భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు. రంగం కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా,  ఆషాఢ బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని  సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు సోమవారం దర్శించుకున్నారు.