టాంజానియాలో కొత్త క్రికెట్‌‌ స్టేడియం.. ప్రారంభించిన ICC చైర్మన్ జై షా

టాంజానియాలో కొత్త క్రికెట్‌‌ స్టేడియం.. ప్రారంభించిన ICC చైర్మన్ జై షా

డోడోమా (టాంజానియా): ప్రపంచంలో క్రికెట్‌‌ను మరింత విస్తరించేందుకు ఐసీసీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో టాంజానియాలో తొలి ఐసీసీ అమోదిత ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ స్టేడియాన్ని చైర్మన్‌‌ జై షా ప్రారంభించాడు. టాంజానియా క్రికెట్‌‌ అరీనా పేరుతో నిర్మించిన ఈ వేదిక ప్రారంభం ఆ దేశంలోనూ, ఆఫ్రికా ఖండంలోనూ క్రికెట్‌‌ అభివృద్ధిలో చారిత్రక మైలురాయిగా నిలిచింది. ఈ అద్భుతమైన స్టేడియాన్ని నిర్మించిన టాంజానియా క్రికెట్‌‌ బోర్డును షా అభినందించారు. 

ప్రపంచ స్థాయి క్రికెట్‌‌ మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరి సమష్టి కృషిని కొనియాడారు. ‘టాంజానియా క్రికెట్‌‌ అరీనా ప్రారంభోత్సవం ఆ దేశ క్రికెట్‌‌ చరిత్రలో అద్భుతమైన క్షణం. ఆఫ్రికా వ్యాప్తంగా ఆటను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. టాంజానియాలో క్రికెట్‌‌ను విస్తరించేందుకు కృషి చేసిన అందరి నిబద్ధతకు ఈ స్టేడియం నిదర్శనం’ అని జై షా పేర్కొన్నాడు.