హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పోలీస్ శాఖలో డీజీపీ హోదాలో పనిచేస్తున్న ఓ మహిళా ఐపీఎస్ అధికారిపై ‘ఎక్స్’లో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో సంబంధిత ఎక్స్ అకౌంట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా అధికారిపై అసభ్య పదజాలంతో పోస్టు చేసినట్లు గుర్తించిన టీజీసీఎస్‌బీ సైబర్ పెట్రోలింగ్ బృందం సుమోటోగా కేసు నమోదు చేసింది.
టీజీసీఎస్‌బీ ప్రధాన కార్యాలయంలో సైబర్ ప్యాట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బత్తుల సాయికృష్ణ ఈ నెల 1న ‘IMRAN KHAN (@Shailubha007)’పేరుతో ఉన్న ‘ఎక్స్’అకౌంట్‌లో సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిపై అత్యంత అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేసిన పోస్టును గుర్తించారు.
ఆ పోస్టులోని కంటెంట్ మహిళా అధికారిని మాత్రమే కాకుండా మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా ప్రభుత్వ ఉద్యోగుల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు, యూఆర్‌ఎల్‌లు తదితర డిజిటల్ ఆధారాలను భద్రపరిచిన అనంతరం టీజీసీఎస్‌బీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
