ప్రజా సమస్యలే పీకే అస్త్రం.. బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సక్సెస్ సీక్రెట్ ఇదే..! 

ప్రజా సమస్యలే పీకే అస్త్రం.. బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సక్సెస్ సీక్రెట్ ఇదే..! 

పాట్నా: 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవలేకపోవడం జన్ సూరాజ్ పార్టీ (జేఎస్‌‌పీ) చీఫ్ ప్రశాంత్ కిశోర్ (పీకే) రాజకీయ ప్రయాణానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. అయితే, ఆ ఓటమి నుంచి వెంటనే పాఠాలు నేర్చుకున్న ఆయన.. తన పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశారు. భారీ వ్యయంతో కూడిన ప్రచారాలకు స్వస్తి పలికి, కేవలం వంద మంది కోర్ స్టాఫ్‌‌తో కూడిన యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకున్నారు. 

ఎన్నికలకు దాదాపు రెండు నెలల ముందే బంకిపూర్ ప్రజల దగ్గరికి వెళ్లారు. పెద్ద పెద్ద సభలకు బదులుగా వ్యక్తిగతంగా ఒక్కొక్క ఓటర్‎ను కలిశారు. పాదయాత్రలకు పెద్దపీట వేశారు. రోజూ ఉదయం చిన్న వీధుల్లో సైతం తిరుగుతూ.. ప్రజలతో కలిసి టీ తాగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి కొరత, దెబ్బతిన్న రోడ్లు, ట్రాఫిక్ రద్దీ, నాణ్యమైన విద్య, ఉపాధి వంటి సమస్యలపైనే తన ప్రచారాన్ని ఫోకస్ చేశారు.

నియోజకవర్గాన్ని వ్యూహాత్మక జోన్లుగా విభజించి.. ప్రతి బూత్‌‌లోనూ మహిళా, యువ బృందాలతో పార్టీని కిందిస్థాయి నుంచి బలంగా నిర్మించారు. మరోవైపు.. 35 ఏండ్లుగా తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకిపూర్‌‌ను కాపాడుకునేందుకు బీజేపీ నానాపాట్లు పడింది. స్వయంగా ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, బీజేపీ చీఫ్ నితిన్ నబిన్, నలుగురుకి పైగా కేంద్ర మంత్రులు, దాదాపు నలభై మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించి సర్వశక్తులు ఒడ్డింది. 

అధికార పక్షం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, పీకే సాగించిన అలుపెరగని గ్రౌండ్ క్యాంపెయిన్ ఆ బలమైన కంచుకోటను బద్దలు కొట్టింది. వ్యూహాత్మక అడుగులతో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రశాంత్ కిశోర్ పూర్తిస్థాయిలో నిలువరించి తన రాజకీయ సత్తా ఏంటో యావత్ దేశానికి నిరూపించుకున్నారు.