న్యూఢిల్లీ: ఇండియా క్రికెట్ జట్టులో కీలక ఆటగాళ్లు తరచూ గాయాలబారిన పడుతుండటం ఇప్పుడు బీసీసీఐని కలవరపెడుతోంది. కీలకమైన సిరీస్‌కు ముందు స్టార్ ప్లేయర్లు ఏదో ఒక గాయంతో చివరి నిమిషంలో జట్టుకు దూరమవుతున్నారు. అప్పటి వరకు ఫిట్‌నెస్ సాధిస్తారని భావిస్తున్నా.. ఆ దిశగా ప్లేయర్లు అడుగులు వేయలేకపోతున్నారు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా హెడ్ ఫిజియోథెరపిస్ట్ కమ్లేశ్ జైన్‌పై నెలకొంది.
అతని పని తీరుపై అటు సెలెక్టర్లు, ఇటు బీసీసీఐ పెద్దలు తీవ్రస్థాయిలో గుర్రుగా ఉన్నట్లు సమాచారం. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ తర్వాత జైన్ పని తీరును సమీక్షించి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అతనిపై వేటు వేయడానికి కూడా వెనకడుగు వేయబోమని స్పష్టమైన సంకేతాలిస్తోంది.
బుమ్రా గాయంతో..
ఇంగ్లండ్ టూర్‌లో గాయపడిన పేసర్ బుమ్రా ఇప్పటివరకు ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. లంక టూర్ నేపథ్యంలో బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ పాసైనట్లు బీసీసీఐ సీవోఈ ప్రకటించింది. తీరా ఒక్క రోజు వ్యవధిలోనే అతని గాయం ఇంకా మానలేదని లంక టూర్ నుంచి తప్పించారు. దాంతో సీవోఈలో మేనేజ్‌మెంట్ సరిగ్గా లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే టైమ్‌లో హెడ్ ఫిజియోగా కమ్లేశ్ పని తీరుపై కూడా అనుమానాలు పెరిగాయి.
హర్షిత్, నితీశ్, సుందర్ సీవోఈలోనే రిహాబిలిటేషన్‌లో వాళ్లు పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దాంతో పలువురు సీనియర్ క్రికెటర్లు బయటి నుంచి నిపుణుల సలహాలు తీసుకుంటున్నారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. అదే టైమ్‌లో మాజీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ స్థానంలో ఏడ్రియన్ లే రూక్స్ బాధ్యతలు స్వీకరించడం కూడా సజావుగా జరగలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
‘హెడ్ ఫిజియో కమలేష్, సీవోఈలోని నిపుణుల పాత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జట్టుకు గాయాల బెడద ఏమాత్రం మంచిది కాదు, ఎందుకంటే కెప్టెన్, కోచ్ ఇద్దరూ పూర్తిస్థాయి తుది జట్టును బరిలోకి దించడానికే ఇబ్బందిపడుతున్నారు. తొమ్మిది మందితో కూడిన జట్టును కూడా ఎంపిక చేయలేకపోతున్నప్పుడు తుది కూర్పు గురించి ఎలా ఆలోచిస్తారు..? ప్రతి స్థానానికి తీవ్రమైన పోటీ ఉన్నందున ఒకే ప్లేయర్ తన శరీరాన్ని మరింతగా కష్టపెట్టాల్సి వస్తోంది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఫిజియో జైన్, టీమ్ డాక్టర్ రిజ్వాన్ ఖాన్‌ల పదవులకు ముప్పు తప్పకపోవచ్చని తెలిపాయి.
కెప్టెన్, కోచ్ అసంతృప్తి
2022లో నితిన్ పటేల్ ప్లేస్‌లో హెడ్ ఫిజియోగా బాధ్యతలు స్వీకరించిన కమ్లేశ్ ప్లేయర్లపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్లేయర్ల శరీరాన్ని బట్టి వాళ్లను సరైన రీతిలో తీర్చిదిద్దడం లేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది నెలలుగా టీమిండియా ప్లేయర్లు ఎక్కువగా గాయాల బారిన పడటంతో అతని పని తీరుపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, గుర్నూర్ బ్రార్ కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.
ఆ తర్వాత హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి కూడా గాయాలతోనే జట్టుకు దూరమయ్యారు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా తొలి టెస్ట్‌కు దూరం కాగా, రెండో మ్యాచ్ ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. దాంతో గిల్, గంభీర్.. జైన్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ప్లేయర్ల ఫిట్‌నెస్ సమస్యలతో అత్యుత్తమ జట్టును బరిలోకి దించలేకపోతున్నామని వాళ్లు వాపోతున్నారు.
