న్యూఢిల్లీ, వెలుగు: రీవంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (సవరించిన విద్యుత్ పంపిణీ రంగ పథకం–ఆర్డీఎస్‌ఎస్) కింద ఏర్పాటు చేసే స్మార్ట్ మీటరింగ్ పనుల్లో తెలంగాణ భాగస్వామ్యం కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆర్డీఎస్‌ఎస్ కింద రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలు, షెడ్యూల్డ్ తెగల గృహాల ఆన్-గ్రిడ్ విద్యుదీకరణ కోసం రూ.120.42 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఇందులో రూ.35.65 కోట్లతో ఇప్పటివరకు 35,572 ఇండ్లకు విద్యుదీకరణ పూర్తయిందని తెలిపింది.
సోమవారం రాజ్యసభలో ఎంపీ బి.పార్థసారథి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కాగా, దేశవ్యాప్తంగా 2026 జూన్ 30 నాటికి ఆర్‌డీఎస్‌ఎస్ కింద 5.73 కోట్ల స్మార్ట్ మీటర్లు, ఇతర పథకాలతో కలిపి మొత్తం 7.24 కోట్ల స్మార్ట్ మీటర్లను అమర్చినట్లు తెలిపారు.
