మిర్యాలగూడ, వెలుగు : యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం, నర్సాపూర్, సాత్ తండా, పెద్ద తండాకు చెందిన నిర్వాసితులు సోమవారం ప్లాంట్ మెయిన్ గేటు ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ, అటవీ భూములను ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న తమకు నష్టపరిహారం, స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం, జెన్ కో ఆఫీసర్లు హామీ ఇచ్చారని చెప్పారు. దశాబ్ద కాలం గడిచినా హామీలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నిర్వాసితులకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసుల ప్లాంట్ వద్దకు చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆఫీసర్లు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
