- రూ.77.23 కోట్లతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన సెర్ప్
- గొర్రె పొట్టేళ్ల పెంపకానికి రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల లోన్
- 587 మదర్ యూనిట్ల ద్వారా పెరటి కోళ్ల పంపిణీ
- పశు పోషణతో పాటు అనుబంధ రంగాలకూ ప్రాధాన్యం
హైదరాబాద్, వెలుగు : గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు స్థానికంగా జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణ అమలుచేస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో పాడి, పశుపోషణ రంగాలకు పెద్దపీట వేస్తూ సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోంది.
2023 నుంచి ఈ ఏడాది వరకు నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్) కింద వచ్చే కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (సీఐఎఫ్) ద్వారా రూ.107 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.25 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు వివిధ రకాల పశుపోషణ యూనిట్లను మంజూరు చేశారు.
తాజాగా 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ. 77.23 కోట్ల అంచనాతో కొత్తగా 1.90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 553 మండల సమాఖ్యల పరిధిలో మొత్తం 11 రకాల జీవనోపాధి రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నారు.
587 మదర్ యూనిట్లతో పెరటి కోళ్లు
తక్కువ పెట్టుబడితో రోజూవారీ ఆదాయాన్ని సమకూర్చే పెరటి కోళ్ల (నాటుకోళ్లు) పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 75,011 పెరటి కోళ్ల యూనిట్లను నెలకొల్పారు. నాణ్యమైన కోడిపిల్లలను లబ్ధిదారులకు అందించడానికి 587 మదర్ యూనిట్లను ఏర్పాటు చేశారు. వీటిలో కోడిపిల్లలను పెంచి, క్రమం తప్పకుండా టీకాలు వేసిన తర్వాతే మహిళలకు అందజేస్తున్నారు.
ఫలితంగా కోళ్ల మరణాలు తగ్గి, డిమాండ్‌కు తగ్గట్లుగా గుడ్లు, మాంసం విక్రయాల ద్వారా మహిళల చేతికి నగదు అందుతోంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకల పెంపకానికి ఉన్న మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మహిళలకు ప్రత్యేక ఆర్థికసాయం అందజేస్తున్నారు. ఒక్కో గొర్రె పొట్టేళ్ల యూనిట్ ఏర్పాటుకు సామాజిక పెట్టుబడి నిధి (సీఐఎఫ్) ద్వారా రూ. 90 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నారు.
బ్యాంకుల ద్వారా కేవలం నాలుగు శాతం వడ్డీకే ఈ రుణాలు లభిస్తుండడంతో మహిళలకు ఆర్థిక భారం తగ్గుతోంది. పెంపకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 787 గొర్రెలు, మేక పిల్లల నర్సరీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
81 మొబైల్ఫిష్రిటైల్అవుట్ లెట్లు
పశుపోషణతో పాటు ఇతర అనుబంధ రంగాలకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద 60 శాతం సబ్సిడీతో 81 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లను, 63 మత్స్య పెంపకం యూనిట్లను అందించారు. పాలు, పాల ఉత్పత్తుల విక్రయాల కోసం 90 మిల్క్ పార్లర్లు, 77 గడ్డి కత్తిరించే యంత్రాలు (చాఫ్ కట్టర్లు), 55 పశుగ్రాస యూనిట్లు, 23 కౌజు పిట్టల (క్వెయిల్) పెంపకం యూనిట్లను ప్రారంభించారు. అదేవిధంగా పాల విక్రయదారులకు సరైన మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు ఖమ్మం జిల్లా మధిర, హనుమకొండ జిల్లా పరకాలలో ‘ఇందిరా మహిళా డెయిరీ’లను నెలకొల్పారు.
ఎంపిక నుంచి విక్రయం వరకు పర్యవేక్షణ
ఈ పథకాలు క్షేత్రస్థాయిలో సద్వినియోగమయ్యేలా సెర్ప్ క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. యూనిట్ల ఎంపిక, కొనుగోలు ప్రక్రియ, పశువైద్యులతో సమన్వయం చేసుకుంటూ జీవాలకు సమయానికి రోగనిరోధక టీకాలు వేయించడం, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వరకు అన్ని దశల్లోనూ ఆసరాగా నిలుస్తున్నారు. ఈ జీవనోపాధి కార్యక్రమాల ద్వారా సమకూరుతున్న ఆదాయం గ్రామీణ మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది.
గతంలో కుటుంబ అత్యవసరాలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడిన మహిళలు.. నేడు సొంతంగా సంపాదిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. రోజూవారీ ఆదాయంతో పాటు శాశ్వత ఆస్తులు సమకూరుతుండంతో వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
