ఎలక్ట్రిక్ కార్లు యమ కొంటుర్రు.. జులైలో సేల్స్ 82 శాతం జంప్

ఎలక్ట్రిక్ కార్లు యమ కొంటుర్రు.. జులైలో సేల్స్ 82 శాతం జంప్
  • గత నెలలో 31 వేల బండ్ల అమ్మకం
  •     గిరాకీ ఎక్కువ.. సప్లై తక్కువ
  •     43 శాతం వాటాతో టాటా టాప్​

న్యూఢిల్లీ:పెట్రోల్, డీజిల్​ ధరలు విపరీతంగా పెరగడంతో ఎలక్ట్రిక్​ వెహికల్స్ (ఈవీలు)​ భారీగా అమ్ముడవుతున్నాయి. గత నెల ఎలక్ట్రిక్​ కార్ల విక్రయాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. కేంద్రానికి చెందిన వాహన్ పోర్టల్ డేటా ప్రకారం, జులైలో మొత్తం 31,788 ఈవీలు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో 17,509 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి 82 శాతం వృద్ధి నమోదైంది.  

కొత్త కార్ల అమ్మకాలలో ఈవీల వాటా గత ఏడాది జులైలో 5 శాతంగా ఉండగా, ఈసారి 7.8 శాతానికి పెరిగింది. పెట్రోల్, డీజిల్, ఈవీ, సీఎన్జీ మోడల్స్ అన్నీ కలిపి గత నెలలో మొత్తం సేల్స్ 18 శాతం పెరిగాయి. ఈ విషయమై మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ, యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి తమ ఎలక్ట్రిక్​ కారు ఈ–విటారా బుకింగ్స్ రెట్టింపు అయ్యాయని తెలిపారు.

 నెలకు 2,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, ప్రతి నెలా 4,000 కు పైగా బుకింగ్స్ వస్తున్నాయని చెప్పారు.  కియా ఇండియాకు చెందిన అతుల్ సూద్ మాట్లాడుతూ గల్ఫ్ సంక్షోభం, ఇంధన ధరల ప్రభావం వల్ల ఈవీలకు డిమాండ్ పెరిగిందని  తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తమ కంపెనీ గత నెల సిరోస్ ఈవీని మార్కెట్లోకి తెచ్చిందని ఆయన వివరించారు. 

విడిభాగాల కొరతతో ఇబ్బందులు

టాటా మోటార్స్​ సీనియర్​ఎగ్జిక్యూటివ్​ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. ఈవీలకు డిమాండ్‌‌‌‌కు తగినట్లుగా సరఫరా ఉండటం లేదని, విడిభాగాల కొరత కారణంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అమ్మకాల్లో ప్రతి నెలా 20 శాతం వృద్ధి కనిపిస్తోందని చెప్పారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి టాటా, మహీంద్రా, మారుతి సుజుకి వంటివి ప్రతి నెలా సగటున 28,543 ఈవీలను అమ్మాయి. గత అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య ప్రతి నెలా 16,956 యూనిట్ల వరకు అమ్ముడయ్యేవి. 

ఈ ఏడాది జులైలో 43 శాతం మార్కెట్ వాటాతో టాటా మోటార్స్ టాప్​లో ఉంది. మహీంద్రా 24 శాతం, జేఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ ఎంజీ మోటార్ 18 శాతం, మారుతి ఐదు శాతం వాటాను దక్కించుకున్నాయి. మహీంద్రా సీనియర్​ఎగ్జిక్యూటివ్ రాజేష్ జేజురికర్ మాట్లాడుతూ ఈవీల విశ్వసనీయత, డ్రైవింగ్ రేంజ్, తగిన చార్జింగ్ నెట్‌‌వర్క్‌‌‌‌పై ఉన్న ఆందోళనలు తొలగిపోతున్నాయని తెలిపారు. ఈ దశాబ్దం చివరినాటికి ఏటా దాదాపు 10 లక్షల ఎలక్ట్రిక్​ కార్లు అమ్ముడవుతాయని అంచనా.  గతేడాది సేల్స్​  1,76,817 యూనిట్లతో పోలిస్తే ఇది భారీ వృద్ధి.