మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్‌లో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడి బొమ్మ తుపాకీతో భయభ్రాంతులకు గురిచేసిన దంపతులను అరెస్ట్ చేసినట్లు మేడిపల్లి సీఐ జలంధర్ రెడ్డి తెలిపారు. బోడుప్పల్‌కు చెందిన చిత్త రంజన్ బిశ్వాస్ ఇంట్లో క్లౌడ్ కిచెన్ నడుపుతున్నాడు. ఏడాది క్రితం అనిల్ కుమార్, ఆయన భార్య సుమన్ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అనిల్ తరచూ అతని ఇంటికి వెళ్లేవాడు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి అనిల్ బిశ్వాస్‌కు ఫోన్ చేసి దూషించాడు. అనంతరం రాత్రి ఒంటి గంట సమయంలో భార్య సుమన్‌తో కలిసి అతని ఇంట్లోకి ప్రవేశించి, బొమ్మ తుపాకీ చూపించి చంపుతానని బిశ్వాస్, అతని భార్యను బెదిరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
