గ్రేటర్ వరంగల్ లో డెకాయ్ ఆపరేషన్స్ తో అబార్షన్లకు చెక్!

 గ్రేటర్ వరంగల్ లో డెకాయ్ ఆపరేషన్స్ తో  అబార్షన్లకు చెక్!
  •     పున్నేలు ఘటన నేపథ్యంలో  లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలపై ఆఫీసర్ల ఫోకస్
  •     గుట్టుగా సాగుతున్న దందాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాస్థాయి కమిటీ
  •     ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించేలా ప్లాన్

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో గుట్టుగా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు స్విమ్మింగ్ పూల్ లో తల్లీ, ఇద్దరు కూతుళ్ల హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్న ముఠాలకు చెక్ పెట్టేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో ఒక కమిటీని నియమించి, డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేగాకుండా అబార్షన్ల అక్రమ దందా ఆటకట్టించేందుకు జనాలను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భవిచ్ఛిత్తిపై కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి నగదు ప్రోత్సాహకం కూడా అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

పున్నేలు ఘటనతో అలర్ట్..

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు సమీపంలో ఏప్రిల్ 1న స్విమ్మింగ్ పూల్ లో తల్లి, ఇద్దరు కూతుళ్లు దారుణ హత్యకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తన భార్యకు ఆడపిల్లలు పుడుతున్నారనే ఉద్దేశంతో పున్నేలుకు చెందిన అజారుద్దీన్ తన భార్య ఫర్హాత్, ఇద్దరు కూతుళ్లు ఉమేరా, ఆయేషాను స్విమ్మింగ్ పూల్ లో ముంచి హత్య చేశాడు. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లే ఈ దారుణ ఘటనకు కారణమైనట్లు ఆఫీసర్లు నిర్ధారించగా, ప్రైవేటు హాస్పిటల్స్ తో పాటు ప్రభుత్వ డాక్టర్లు గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే హనుమకొండ జిల్లాలోని వేలేరు, శాయంపేట మండలాల్లో బాలికల నిష్పత్తి తగ్గిపోతుండటం, మరోవైపు పున్నేలు ఘటన నేపథ్యంలో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. వరంగల్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు జరిపే ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టారు.

స్పెషల్ టీంతో డెకాయ్ ఆపరేషన్స్..

ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జనాలు వైద్య సేవల కోసం వరంగల్ నగరానికే వస్తుంటారు. ఇందులో రూరల్ ఏరియాల నుంచి వచ్చే వారిని టార్గెట్ చేసుకుని నగరంలోని కొన్ని హాస్పిటల్స్ దందా చేస్తున్నాయి. సిటీలో మొత్తంగా 780 ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా, 353 స్కానింగ్ సెంటర్లకుగానూ 267 పని చేస్తున్నాయి. అందులో కొన్ని ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతోనే గర్భస్థ శిశు నిర్ధారణ నియంత్రణ చట్టం (పీసీపీఎన్డీటీఏ) ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టేందుకు ఇప్పటికే జిల్లా అప్రొప్రియేట్ అథారిటీ కమిటీని యాక్టివేట్ చేయడంతో పాటు అక్రమ దందా సాగించేవాటి ఆటకట్టించేలా డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. 

ఇందులో జిల్లా వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ, పోలీస్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు భాగస్వామ్యం కల్పించారు. ఈ డెకాయ్ ఆపరేషన్స్ లో భాగంగా సస్పెక్టెడ్ హాస్పిటల్స్, క్లినిక్స్, స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నారు. స్వయంగా పేషెంట్లను పంపించి, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వెంటనే పట్టుకునేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ ఆపరేషన్స్ లో పట్టుబడితే వారిపై పీసీపీఎన్డీటీఏ ప్రకారం కఠిన కేసులు నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నారు.

సమాచారం ఇస్తే రూ.50 వేలు..

ఓ వైపు అక్రమ దందా సాగించే స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై డెకాయ్ ఆపరేషన్లకు ప్లాన్ చేస్తూనే మరోవైపు ఈ భాగోతానికి చెక్ పెట్టేందుకు ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎక్కడైనా రూల్స్ కు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరిగితే 104, 1098, 181 టోల్ ఫ్రీ నెంబర్స్ తో పాటు 63000 30940 కు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. అక్రమంగా సాగే ఈ దందాపై కచ్చితమైన సమాచారం అందించిన వారికి రూ.50 వేల నజరానా కూడా ప్రకటించడం గమనార్హం. కాగా ఓ వైపు డెకాయ్ ఆపరేషన్స్, మరోవైపు ప్రజల భాగస్వామ్యం ఇల్లీగల్ అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్షలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇల్లీగల్ టెస్టులు, అబార్షన్లు జరగకుండా యాక్షన్

అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లకు ఆస్కారం లేకుండా జిల్లాస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక టీమ్ తో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నాం. అక్రమంగా సాగే టెస్టులు, అబార్షన్ల గురించి ప్రజలు కూడా బాధ్యతగా సమాచారం అందించాలి.

- డా.ఏ.అప్పయ్య, డీఎంహెచ్వో, హనుమకొండ జిల్లా