ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. లేఆఫ్స్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డున పడుతుంటే..ప్రాజెక్ట్స్ లేక,లాభాలు రాక కంపెనీలు మూతపడుతున్నాయి. ఇప్పుడు మరో ఐటీ కంపెనీ మూతపడింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాత్రికి రాత్రే కంపెనీ మూసేయడంతో 700 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
పుణెలోని థింక్ టెక్నాలజీ ఇండియా అనే ఐటీ కంపెనీ ముందస్తు సమాచారం లేకుండా రాత్రికే రాత్రే మూసేయడం ఐటీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది . కంపెనీ మూసేయడంతో వందలాది మంది ఉద్యోగులు, ఇంటర్న్‌లు, ఫ్రెషర్లు రోడ్డున పడ్డారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా దుకాణం మూసేసింది యాజమాన్యం.
చెప్పా పెట్టకుండా కంపెనీ మూసేసారని.. జీతాల కోసం కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ప్రతి నెల 7 లేదా 8 తేదీల్లో శాలరీ క్రెడిట్ అయ్యేదని... ఫిబ్రవరి 2026 నుండి శాలరీ డిలే అవ్వడం మొదలైందని అంటున్నారు ఉద్యోగులు. ఈ విషయంపై పలు మార్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అంటున్నారు.
2025లో భారీగా ఫ్రెషర్స్, ఇంటర్న్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లను నియమించుకున్నారని.. శాలరీలు, స్టైపెండ్ లు క్రమం తప్పకుండా చెల్లించారని అంటున్నారు ఉద్యోగులు. ఈ ఏడాది ప్రారంభం నుంచి జీతాలు ఆలస్యంగా ఇచ్చారని...ఫిబ్రవరి నుండి జీతాలు ఇవ్వలేదని అంటున్నారు.
రంగంలోకి ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్:
థింక్ టెక్నాలజీస్ ఇండియా కంపెనీ ఉద్యోగులకు మద్దతుగా రంగంలోకి దిగింది ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని..ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఉద్యోగుల నుండి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు:
కంపెనీలో జాయిన్ అయ్యే సమయంలో లాప్ టాప్ ఇస్తున్నామని చెప్పి రూ.15 వేలు సెక్యూరిటీ డిపాజిట్ కూడా తీసుకున్నారని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
