సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జీఆర్ఫీ పోలీసులు, ఆర్ఫీఎఫ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భాగంగా భారీగా గంజాయి పట్టుబడింది. ఓడిశాలోని సంబల్పూర్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని వాడి ప్రాంతానికి రైలు మార్గం ద్వారా అక్రమంగా తరలిస్తున్న 36.74 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఈ తనిఖీల్లో పట్టుబడ్డ మొత్తం గంజాయి విలువ సుమారు రూ.18.18 లక్షలు ఉంటుందని తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.మే 28న డ్రగ్స్ అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గుర్తించామని.. వారిని అదుపులోకి తీసుకొని ట్రాలీ సూట్ కేసు, బ్యాక్ ప్యాక్ చేయగా గంజాయి బయటపడిందని తెలిపారు పోలీసులు.
అరెస్టయిన వారిని మహారాష్ట్రకు చెందిన సుధాంశు కుమార్, బీహార్ కు చెందిన సుమన్ కుమార్ గా గుర్తించారు పోలీసులు. సుధాంశు పుణెలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో డేటా ఇంజినీర్ గా పనిచేస్తుండగా, సుమన్ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రధాన నిందితులు రోహిత్ సాని గోరఖే, అభయ్ లు ఒడిశా నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. ప్రధాన నిందితుల డైరెక్షన్ లో ఒక్కో ట్రిప్ కు రూ.10 వేల కమిషన్ తో గంజాయి రవాణాకు నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు.
మే 25న నాగావళి ఎక్స్ప్రెస్ లో గంజాయితో ప్రయాణం ప్రారంభించిన నిందితులు, చర్లపల్లి స్టేషన్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుసుకుని... రైలులో నుంచి దిగిపోయి రెండు రోజుల పాటు ఓ లాడ్జిలో తలదాచుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఆ తర్వాత మే 28న భవ్నగర్ ఎక్స్ ప్రెస్ లో వాడికి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
