- రాష్ట్రంలో 21 వేల మందికిపైగా అభ్యసన వైకల్య బాధితులు
- దివ్యాంగ విద్యార్థుల్లో అత్యధికంగా 29.21 శాతం మంది వీరే..
- సర్కారు బడుల్లో శిక్షణ పొందిన టీచర్లు 13 శాతమే..
- రాష్ట్రంలో ఐదు శాతం స్కూళ్లలోనే స్పెషల్ ఎడ్యుకేటర్లు..
- ఏడు శాతం బడుల్లోనే టాయిలెట్లు
హైదరాబాద్, వెలుగు : బడికి వెళ్లే పిల్లల్లో కొందరు చదువులో వెనకబడితే.. వాళ్లకు తెలివి లేదని, చదవట్లేదని తిట్టేస్తుంటాం. కానీ ఇందుకు వాళ్ల చదువులో కాదు.. ‘లెర్నింగ్ డిసెబిలిటీ’నే సమస్య అని చాలామందికి తెలియదు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల్లో దాదాపు 30 శాతం మంది ఈ అభ్యసన వైకల్యంతోనే బాధపడుతున్నారు.
ఇటీవల విద్యాశాఖ రిలీజ్ చేసిన పలు గణాంకాల్లో ఈ విషయం బహిర్గతమైంది. వీళ్లతో పాటు బయటకు రాకుండా ఉన్న వాళ్లూ చాలా మందే ఉంటారు. అయితే, వారందరికీ పాఠాలు చెప్పేలా సరైన టీచర్లు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 74,57,851 మంది చదువుతున్నారు. వీరిలో 72,672 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఉన్నట్టు గుర్తించారు. దీనిలో లెర్నింగ్ డిసెబిలిటీ ఉన్న వారే అత్యధికంగా 21,231 మంది ఉన్నారు. ఈ విద్యార్థులంతా అక్షరాలు గుర్తుపట్టడం, రాయడం, చదవడం వంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు.
వీరికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిసినా.. సర్కారు బడుల్లో మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరి తర్వాత 11,936 (16.42 శాతం) మంది దృష్టి లోపం ఉన్నవారు ఉండగా.. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సమస్యలతో 8,161 మంది, బుద్ధిమాంద్యంతో 7,944 మంది విద్యార్థులు బాధపడుతున్నారు. ఇంతటి తీవ్రమైన సమస్య ఉన్నప్పటికీ, వీరిని గుర్తించి ప్రత్యేకంగా బోధించే వ్యవస్థ మన బడుల్లో నామమాత్రంగానే ఉంది.
శిక్షణ లేని టీచర్లు..
రాష్ట్రంలో మొత్తం 3.57 లక్షల మంది టీచర్లు ఉండగా, దానిలో ఇంక్లూజీవ్ ఎడ్యుకేషన్ పై కనీస అవగాహన ఉన్న వాళ్లు, శిక్షణ పొందిన వారు కేవలం 47,733 (13.34 శాతం) మంది మాత్రమే. ఈ టీచర్లకు మాత్రమే ఈ పిల్లలను ఎలా డీల్ చేయాలో తెలుసు. ఇక ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం కేటాయించిన స్పెషల్ ఎడ్యుకేటర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా కేవలం 1,258 మంది మాత్రమే స్పెషల్ ఎడ్యుకేటర్లు ఉన్నారు. దీనివల్ల కేవలం 5.53 శాతం బడుల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. మిగిలిన 94 శాతం బడుల్లో దివ్యాంగ విద్యార్థులు సాధారణ టీచర్లు ఇచ్చే భరోసాపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే, డిప్లొమా/డిగ్రీ కలిగిన ప్రత్యేక టీచర్ల సంఖ్య కూడా కేవలం 4,615కే పరిమితమైంది.
క్లాసు పెరిగే కొద్దీ తగ్గుతున్న విద్యార్థులు..
ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల డ్రాపౌట్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రైమరీలో ఒకటో తరగతిలో 6.62 శాతం ఉన్న దివ్యాంగ విద్యార్థుల సంఖ్య.. పైతరగతులకు వెళ్లేసరికి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇంటర్మీడియట్ నాటికి ఇది కేవలం 3.90 శాతానికి పడిపోతున్నట్టు అధికారులు చెప్తున్నారు. బడుల్లో సరైన వసతులు, ప్రత్యేక టీచర్లు లేకపోవడంతోనే దివ్యాంగ విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్పెషల్ వసతులేవీ..?
బడికి వచ్చే దివ్యాంగ విద్యార్థులకు కనీస సౌకర్యాలు పెద్దగా లేవు. రాష్ట్రంలోని 76.71 శాతం (33,105) బడుల్లో ర్యాంపులు నిర్మించినప్పటికీ, ఇతర కీలక వసతులు మాత్రం అంతంతే ఉన్నాయి. ప్రధానంగా దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా ఉండాల్సిన టాయిలెట్లు కేవలం 3,216 బడుల్లోనే ఉన్నాయి. మరో 92 శాతానికి పైగా ఎక్కువ బడుల్లో దివ్యాంగ పిల్లలకు తగిన టాయ్‌లెట్లు లేవు. దీంతో వాళ్లంతా బడులకు రావాలంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని పేరెంట్స్, టీచర్లు కోరుతున్నారు.
