- కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ సురేశ్ షెట్కార్‌కు వినతిపత్రం అందజేత
న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్– సిరిసిల్ల– వేములవాడ– కామారెడ్డి– ఎల్లారెడ్డి– పిట్లం (కేకేవై) వరకు ఉన్న 165 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు చొరవ చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ విజ్ఞప్తి చేశారు. నేషనల్ హైవే కింద తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ రహదారి అభివృద్ధి చెందితే తెలంగాణ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభించడంతో పాటు మహారాష్ట్రతో అనుసంధానం బలపడుతుందని నేతల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఢిల్లీలో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్‌హెచ్–563, ఎన్‌హెచ్–44, ఎన్‌హెచ్–765డీ, ఎన్‌హెచ్–161లను కలిపే కీలక కారిడార్‌గా ఇది రూపాంతరం చెందుతుందన్నారు. ఈ ప్రతిపాదనకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా పరిశీలనలు పూర్తయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు సిఫార్సు చేసిందని వెల్లడించారు. సూత్రప్రాయ ఆమోదం లభించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తుది అనుమతి కోసం వేచి చూస్తోందన్నారు.
