- మే 31తో ముగియనున్న గడువు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భూగర్భజలాల పెంచేందుకు చేపట్టిన ‘జల సంచయ్ జన భాగీదారీ’ (జేఎస్‌బీజే 2.0) కార్యక్రమంలో రాష్ట్రం దూసుకెళ్తోంది. జల సంరక్షణ పనుల్లో జాతీయ స్థాయిలో తెలంగాణ ఐదో ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,86,073 పనులు పూర్తి కావడంతో పాటు పోర్టల్‌లోనూ అప్‌లోడ్ అయ్యాయి. ఈ నెల 31వ తేదీతో ఈ పనుల అప్‌లోడింగ్ గడువు ముగియనుండడంతో పనుల్లో మరింత వేగం పెంచారు.
టాప్‌లో కరీంనగర్
గ్రామీణ ప్రాంతాల్లో జల సంరక్షణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ నెల 26 నాటికి గ్రామ పంచాయతీల్లో మొత్తం 3,27,465 పనులు పూర్తయ్యాయి. ఈ నెల 20 నుంచి 26 వరకు కేవలం ఆరు రోజుల్లోనే 2,12,101 కొత్త పనులను పూర్తి చేసి రికార్డు సృష్టించారు.
జిల్లాల వారీగా చూస్తే.. కరీంనగర్ జిల్లా 52,146 పనులతో అగ్రస్థానంలో ఉండగా.. ఆదిలాబాద్ 42,933, ఖమ్మం 28,409 జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా 1,538 పనులతో చివరి స్థానంలో నిలిచింది. గతేడాది అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోవడం విశేషం.
పట్టణాల్లో ముందు వరసలో హైదరాబాద్
మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణ ప్రాంతాల్లో (యూఎల్‌బీ) పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మొత్తం 32,986 పనులు పూర్తి కాగా.. ఇందులో జీహెచ్‌ఎంసీ నుంచే 19,440 పనులు అప్‌లోడ్ అయ్యాయి. వరంగల్ 8,091 పనులతో రెండో స్థానంలో ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ విభాగం 1,079 పనులు అప్‌లోడ్ చేసింది. ఈ పనుల అప్‌లోడింగ్‌పై ప్రభుత్వం ఆఫీసర్లకు టార్గెట్స్ విధించింది. ప్రతి పంచాయతీలో కనీసం 100 అర్హత కలిగిన పనులను అప్‌లోడ్ చేయాలి. ప్రతి కార్పొరేషన్, యూఎల్‌బీ నుంచి 10 వేల పనుల అప్‌లోడింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు నాణ్యతతో ఉండాలని, ప్రతిరోజూ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను మానిటర్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
జల్ సంచయ్ – జన్‌భాగీదారీ కార్యక్రమంలో ఐదు కీలక శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోక్‌పిట్స్, ఫాంపాండ్స్, చెక్‌డ్యామ్‌లు, పురపాలక శాఖ పరిధిలో రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్, ఇంజక్షన్ వెల్స్, అటవీ శాఖ రాక్‌ఫిల్ డ్యామ్స్, నీటిపారుదల శాఖ నేతృత్వంలో చెక్ డ్యామ్స్, స్టోన్ గల్లీ ప్లగ్స్, భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో బోర్ వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ల పనులు పూర్తిచేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
