పెరుగుతో ఐదు రకాల డిషెష్ ..వడదెబ్బ, డీహైడ్రేషన్ నుంచి బయటపడొచ్చు

పెరుగుతో ఐదు రకాల డిషెష్ ..వడదెబ్బ, డీహైడ్రేషన్ నుంచి బయటపడొచ్చు

ఎండాకాలంలో మండే ఎండలు, వడగాలులు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా జీర్ణక్రియపై ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది. గుండెల్లో మంట, ఎసిడిటీ, అజీర్ణం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పెరుగుతో తయారయ్యే వంటకాలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా కడుపుకు ఉపశమనం కలిగిస్తాయి. వేసవిలో తప్పనిసరిగా తినాల్సిన ఐదు పెరుగు వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చల్లని క్రీమీ లస్సీ..

ఎండాకాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాల్లో లస్సీ ఒకటి. బయట ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఒక గ్లాసు చల్లని లస్సీ తాగితే శరీరానికి వెంటనే హాయినిస్తుంది. పెరుగులో నీరు లేదా పాలు, పంచదార, యాలకుల పొడి కలిపి చిలికితే క్రీమీ లస్సీ రెడీ అవుతుంది. పుదీనా లేదా మామిడి పండు కలిపి మామిడి లస్సీగా కూడా తయారు చేసుకోవచ్చు.

టెంపర్డ్ మజ్జిగ..

మజ్జిగ కూడా ఎండాకాలంలో అద్భుతమైన డ్రింక్..ఇది జీర్ణానికి తేలికగా ఉండి శరీరానికి తేమను అందిస్తుంది. పెరుగులో నీళ్లు కలిపి, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి తయారు చేసే టెంపర్డ్ మజ్జిగ గ్యాస్, ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది.

దోసకాయ ,పుదీనా రైతా..

దోసకాయ, పుదీనా రైతా కూడా శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడుతుంది. తురిమిన దోసకాయ, పుదీనా ఆకులు, జీలకర్ర పొడి, ఉప్పు కలిపిన పెరుగు డీహైడ్రేషన్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

పెరుగు అన్నం..

దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పెరుగు అన్నం వేసవికి బెస్ట్ ఫుడ్‌గా చెప్పవచ్చు. ఇది జీర్ణానికి తేలికగా ఉండి అజీర్ణం, విరేచనాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పండ్ల పెరుగు

ఇక తీపి రుచిని ఇష్టపడేవారికి పండ్ల పెరుగు(ఫ్రూట్ యోగర్ట్) మంచి ఎంపిక. చిక్కటి పెరుగులో సీజనల్ పండ్లు కలిపి తయారు చేసే ఈ డెజర్ట్ శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.