- పేరుకుపోయిన మట్టి, చెత్త భారీ వానలు పడితే మునుగుడే
- ఏప్రిల్ డెడ్‌లైన్ అయినా లైట్ తీస్కున్నరు
- తీసిన పూడిక ఎత్తకపోవడంతో కాలనీల్లో కంపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: వానాకాలం సమీపిస్తున్నప్పటికీ నాలాల్లో పూడికతీత పనులు ఇంకా పూర్తి కాలేదు. నాలాల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త కారణంగా నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇప్పటికే పలుచోట్ల నాలాలు పూడికతో నిండిపోవడంతో భారీ వర్షాలు కురిస్తే వరద బస్తీలు, కాలనీలను ముంచెత్తే ప్రమాదం ఉంది. 3 కార్పొరేషన్లలో దాదాపు 450 కిలోమీటర్ల మేర మేజర్ నాలాలు, మరో 850 కిలోమీటర్ల మేర మైనర్ నాలాలు ఉన్నాయి. ప్రతి ఏడాది వానాకాలానికి ముందే పూడికతీత పనులు చేపట్టాల్సి ఉండగా, ఈసారి మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి.
అధికారుల ప్లాన్ప్రకారం ఏప్రిల్ నెలాఖరులోపే డీ-సిల్టింగ్ పూర్తి కావాల్సి ఉన్నా.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పనులు ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా పనులు చేయకపోవడం, మరోవైపు జీహెచ్ఎంసీ, ఎంఎంసీల్లో ఇంజినీర్ల నిర్లక్ష్యం వల్ల పూర్తి కావడం లేదని తెలుస్తోంది. ఈసారి భారీ వర్షాలు పడితే నాలాల సమీపంలో బస్తీలు, కాలనీలు ముంపునకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో కార్పొరేషన్అయిన సైబరాబాద్మున్సిపల్కమిషనరేట్పరిధిలో మాత్రం డీ-సిల్టింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయని అధికారులు చెప్తున్నారు. ఎక్కడైనా డీ-సిల్టింగ్ పనులు జరగకపోతే అందుకు కాంట్రాక్టరే బాధ్యత వహించాలని కమిషనర్ సృజన ఇప్పటికే హెచ్చరించడంతో ఇక్కడ పనులు స్పీడ్‌గా పూర్తయ్యాయని తెలుస్తోంది.
- రోడ్లపై పూడికతో కంపు
నాలాల్లోంచి తీసిన పూడికను తరలించడంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. మొదట్లో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు తరలించామని, ఇప్పుడు తీసుకువెళ్తే అనుమతించడం లేదంటున్నారు. దీంతో నాలాల్లోంచి తీస్తున్న పూడికను పక్కనే కుప్పలుగా పోసి వదిలేయాల్సి వస్తోందంటున్నారు. రోజుల తరబడి అక్కడే ఉండడంతో దుర్వాసన వచ్చి ప్రజలు కంపు భరించలేకపోతున్నారు.
కొన్నిచోట్ల నెల రోజులుగా రోడ్లపై నుంచి తరలించకపోవడంతో రాకపోకలు కూడా బందవుతున్నాయి. వర్షం పడేలోపు పూడిక ఎత్తకపోతే తిరిగి మళ్లీ నాలాల్లోకి చేరే అవకాశం ఉంటుంది. డంపింగ్ యార్డులో అనుమతించకపోవడంపై మల్కాజిగిరి మున్సిపల్కార్పొరేషన్కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని వివరణ కోరగా ‘అటువంటిదేమీ లేదు. మా కమిషనరేట్పరిధిలో పూడికను డంపింగ్ యార్డుకే పంపుతున్నాం..అయితే, పూర్తిగా డ్రై అయిన తర్వాత తీసుకువస్తేనే అనుమతిస్తున్నాం’ అని స్పష్టం చేశారు.
