బిహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు ముఖ్యంగా బీజేపీని ఇబ్బందికి గురిచేసేవే. గుజరాత్ ఉప ఎన్నికలో గెలిచినా.. మిగతా రెండింటిలో బీజేపీ ఓటమిపాలు కావడమే ఆ పార్టీ తమకు ఎదురు లేదనే ‘TINA’ ( There is no alternate) ఫ్యాక్టర్ ధీమాకు గండికొట్టినంత పనైంది. మధ్యప్రదేశ్‌లోని దతియా ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని తిరిగి నిలుపుకుందనేకన్నా. అధికార పార్టీగా ఉండి కూడా బీజేపీ ఓడిపోవడమే కీలకంగా మారింది. ముఖ్యంగా బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖాళీ చేసిన బిహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీ ఓటమిపాలు కావడం, జన్ సురాజ్ స్థాపకుడు ప్రశాంత్ కిషోర్ భారీ మెజారిటీతో గెలవడం, ఒక రకంగా బిహార్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పినట్లైంది. మిగతా ఉప ఎన్నికలకన్నా బీజేపీ ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న బంకీపూర్ ఉప ఎన్నికలో అది ఓడిపోవడమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలి వరుస సంఘటనలు బీజేపీ ప్రతిష్టకు పెద్ద సవాలుగా మారిన సందర్భంలో ఉప ఎన్నికల ఫలితాలపై కొంతైనా వాటి ప్రభావం ఉందనేదే విశ్లేషకుల అభిప్రాయం. అయోధ్యలో జరిగిన అక్రమాలు చర్చలోకి రావడం, నీట్ పేపర్ లీక్‌పై జరిగిన దీక్షను నిర్లక్ష్యం చేయడం, హింసాత్మక సంఘటనలు, ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ మోదీ సర్కార్ పనితీరు ప్రజల్లో చర్చగా మారిన నేపథ్యంలో .. జరిగిన ఈ ఉప ఎన్నికలను అవి ఎంతోకొంత ప్రభావితం చేయకపోలేదు. ‘Tina’ ఫ్యాక్టర్ జబ్బే ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించిందనే అభిప్రాయమే ఇపుడు సర్వత్రా వినిపిస్తోంది.
చేదు అనుభవంగా మారిన బంకీపూర్
బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని గత35 ఏళ్లుగా బీజేపీయే గెలుస్తూ వస్తోంది. నితిన్ నబిన్ అక్కడి నుంచి 5 సార్లు గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబిన్ సుమారు 50వేలకు పైగా మెజారిటీతో గెలిచిన స్థానమది. ఏడాది కూడా తిరక్కముందే బీజేపీ అక్కడ ఓటమిపాలు కావడమే ఆ పార్టీకి ఇపుడు మింగుడు పడని విషయంగా మారింది. అందునా నూతనంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయిన నితిన్ నబిన్ ఖాళీ చేసిన స్థానంలో పార్టీ ఓటమిపాలు కావడమే ఆ పార్టీ ప్రతిష్టకు ఇపుడు గండిపడినట్లయింది. గట్టి బలమున్న స్థానంలో ఓటమి ఎదురుకావడం చూస్తే, అందుకు ఆ పార్టీ తరఫున జరిగిన తప్పులు లేవని కాదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లోనే జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడాన్ని తక్కువగా అంచనా వేసినట్లున్నారు. ప్రశాంత్ కిషోర్ తమకు పోటీయే కాదని చెప్పడానికేనేమో ఒక మండల స్థాయి రాజకీయ ‘అనామకుణ్ణి’ (నీరజ్ సిన్హా) అభ్యర్థిగా నిలబెట్టారు. ప్రశాంత్ కిషోర్ తమకు పోటీయే కాదనే సందేశం ఇవ్వడానికే అలా ఒక అనామకుణ్ణి నిలబెట్టారనే వ్యాఖ్యలు కూడా వినబడ్డాయి. కానీ ‘Tina’ (There is no alternate) ఫ్యాక్టర్ ఆవహించిన బీజేపీకి బంకీపూర్ ఒక చేదు అనుభవం. రాజకీయాల్లో ఏది పెరిగినా, అహంభావం మాత్రం పెరగొద్దు. అది పెరిగితే అంతే సంగతులు తప్పవని బీజేపీకి బంకీపూర్ ఫలితం చెపుతోంది.
గెలిపించింది ‘బిహార్ విజన్’
జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బిహార్‌లో గత అసెంబ్లీ ఎన్నికలకన్నా ముందు సుమారు రెండేళ్లకు పైగా పాదయాత్ర చేశారు. బిహార్ ఎదుర్కొంటున్న సమస్యలే ఎజెండాగా తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బిహార్ వలసలు, విద్య, వైద్యం, దోపిడీ, పారిశ్రామికంగా వెనుకబాటు, బిహార్ సంపద పలాయనం, బ్రేన్డ్రైన్ లాంటి అనేక సమస్యలే బిహార్‌ను దేశంలో ఒక పేద రాష్ట్రంగా (గరీబ్ రాజ్యంగా) మార్చాయనే ప్రశాంత్ కిషోర్ వాదనను, ఆయన బిహార్ విజన్‌ను ప్రజలు అప్పట్లోనే ఆదరించారు. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య (బీజేపీ-, జేడీయూ వర్సెస్ ఆర్జేడీ,- కాంగ్రెస్) జరిగిన ‘బైపోలర్’ ఎన్నికల ఫలితంగా జన్‌సురాజ్‌ను ఎంచుకోవడం ప్రజలకు సైతం సాధ్యం కాలేదంటేనే బాగుంటుంది. ఇపుడొక ఉప ఎన్నిక రావడం, స్వయాన ప్రశాంత్ కిషోరే పోటీకి దిగడం ఆయనను ఎన్నుకోవడానికి బంకీపూర్ ఓటర్లకు సులభమైందని చెప్పాలి. ‘మీరు నాకు కాదు, మీ పిల్లల చదువు కోసం, వలసలు ఆగడం కోసం, పారిశ్రామిక వృద్ధికోసం, మేధోవలసలను నిరోధించడం కోసం, నేను ప్రభుత్వంపై చేసే పోరాటం కోసం ఓటు వేయండి’ అని పీకే చేసిన నూతన ఒరవడి ప్రచారం బంకీపూర్ ఓటర్లను బాగా ఆకర్షించింది.
కుల రాజకీయాలను దాటి..
బిహార్‌ను ఎప్పుడూ కుల రాజకీయాలే శాసిస్తూ వస్తుండటం తెలిసిందే. అలాంటి కుల రాజకీయాలను దాటి గెలుపు సాధించడం అంత సులభం కాదు. కానీ ప్రశాంత్ కిషోర్ కులాలకు అతీతంగా గెలుపు సాధించడం చిన్న విషయమేం కాదు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఓట్లు సాధించాడని ఆయనకు వచ్చిన భారీ మెజారిటీయే చెపుతోంది. ప్రతిపక్ష ఆర్జేడీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోవడం చూస్తే, ఆ పార్టీ ఓట్లు చాలామేరకు ప్రశాంత్ కిషోర్‌కు మళ్లాయని చెపుతున్నాయి. అలాగే, కొంతమేర బీజేపీ ఓటర్లు సైతం ప్రశాంత్ కిషోర్ వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. బిహార్ ప్రజలు మూడో పార్టీగా జన్ సురాజ్ ను ఆదరించడం మొదలుపెట్టారని చెప్పొచ్చు. అధికార, ప్రతిపక్ష పార్టీల ‘కుల రాజకీయాల’ కన్నా, బిహార్ ఎజెండా కలిగిన పార్టీ అసెంబ్లీలో ఉండాల్సిందే అనేదే బంకీపూర్ ఫలితంలో మనకు కనిపిస్తున్న సందేశం.
చేతులు కాలాక గానీ..
చేతులు కాలాక పాఠం నేర్చుకునే ధోరణి బీజేపీలో చాలాకాలంగా కనిపిస్తోంది. వ్యవసాయ బిల్లుల వాపసీ కావచ్చు. జీఎస్టీ తగ్గింపులపై కావచ్చు. మొన్నటి నీట్ పరీక్ష పేపర్ లీకులపై జరిగిన ఆందోళనపై ఆలస్యంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రతిష్టకు ప్రమాదమొస్తే తప్ప నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు. ఇకపోతే, అయోధ్య మందిరంలో జరిగిన హుండీ దోపిడీపై తప్ప, 4 ఏళ్లుగా నిర్మాణంలో, భూముల కొనుగోళ్లలో జరిగిన భారీ అక్రమాలపై ఇప్పటికీ పూర్తి దర్యాప్తు జరగలేదు. ఇపుడు అవే ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారాయి. అయోధ్య విషయంలోనూ మరింత ప్రతిష్ట దెబ్బతింటే తప్ప, జరిగిన భారీ అక్రమాలపై దర్యాప్తు జరపరా అనే హిందువుల ప్రశ్న కూడా ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి గల కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ‘Tina’ ఫ్యాక్టర్ అనే మత్తులో పడి చేతులు కాలేదాకా తెచ్చుకుంటున్న బీజేపీ ఇప్పటికైనా ఆ ధోరణి నుంచి బయటపడితేనే, పాలనాపరంగా, రాజకీయంగా అది తిరిగి
నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి.
పాత ప్రతిపక్షాలను కాదని, కొత్త ప్రత్యామ్నాయాల వైపుగా..
దేశంలో ప్రజలు.. ఉన్న ప్రతిపక్షాలను కాదని, కొత్త ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉదాహరణకు తమిళనాడులో డీఎంకేకు వ్యతిరేకంగా అన్నాడీఎంకేను కాదని, జోసెఫ్ విజయ్ (టీవీకే)పార్టీని ప్రజలు ఎన్నుకోవడం. అలాగే, బిహార్ ఉప ఎన్నికలో ప్రతిపక్ష ఆర్జేడీని కాదని, ప్రశాంత్ కిషోర్ (జన్ సురాజ్) పార్టీని ప్రజలు ఆదరించడమే నిదర్శనం. బీజేపీని ఓడించాల్సి వస్తే, పాత ప్రతిపక్షాలను ప్రజలు పెద్దగా కోరుకోవడం లేదని అర్థమవుతుంది. ఒక విజయ్, ఒక ప్రశాంత్ కిషోర్ లాంటి కొత్త ప్రత్యామ్నాయాలనే ప్రజలు కోరుకోవడం దేశ రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా చెప్పొచ్చు. ప్రత్యామ్నాయంగా విజన్ ఉన్న నేత లేని చోట మాత్రమే పాత ప్రతిపక్షాలు ఉనికిలో ఉండటం గమనించొచ్చు. తెలంగాణలో ప్రత్యామ్నాయ విశ్వసనీయ నేత తయారైతే, ప్రజలు మర్చిపోయిన కేసీఆర్ లాంటి నేత అక్కర ఏముంది? తెలంగాణలో బీజేపీ ఆ పని చేయలేకపోతున్నది. అందుకే కొన్ని రాష్ట్రాల్లో విజయ్‌లు, ప్రశాంత్ కిషోర్ లు ప్రత్యామ్నాయాలుగా రావాల్సిన అవసరం మాత్రం ఉందనే చెప్పాలి.
పీకే నిలదొక్కుకునేనా..
బిహార్ కుల రాజకీయాల్లో జన్‌సురాజ్ నిలదొక్కుకోవడం సులభమేనా అనే ప్రశ్న లేకపోలేదు. కానీ బిహార్‌లోని అన్ని రంగాలను స్డడీ చేసి, వాటికి పరిష్కారాలు చెపుతున్న ప్రశాంత్ కిషోర్ అక్కడి కుల రాజకీయాలను అధిగమించే అవకాశాలను కొట్టేయలేం. బిహారీలు ప్రశాంత్ కిషోర్ నుంచి భిన్నమైన రాజకీయాన్నే ఆశిస్తారు. దాన్ని నెరపగలిగితే బిహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ నిలదొక్కుకునే అవకాశాలు తప్పక ఉంటాయి. అదంతా ప్రశాంత్ కిషోర్ భవిష్యత్ రాజకీయ నడవడికపైనే ఆధారపడిఉంటుంది.
-కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
