- నేడు రాజస్తాన్, గుజరాత్ క్వాలిఫయర్–2 మ్యాచ్
- వైభవ్‌ను అడ్డుకోవడంపైనే జీటీ దృష్టి.. టైటాన్స్ పేసర్లకు కఠిన పరీక్ష
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్–2 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే ఈ హై ఓల్టేజ్ పోరులో రాజస్తాన్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని అడ్డుకోవడంపైనే గుజరాత్ దృష్టి పెట్టింది.
ముల్లన్‌పూర్: ఐపీఎల్–19లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్–2 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే ఈ హై ఓల్టేజ్ పోరులో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఇరుజట్లలో ఫైనల్ చేరేదెవరన్న ఉత్కంఠ మొదలైంది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని అడ్డుకోవడంపైనే గుజరాత్ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయన్నడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కేవలం 29 బాల్స్‌లోనే 97 రన్స్ చేసి విధ్వంసం సృష్టించిన సూర్యవంశీ ఫామ్‌ను అడ్డుకోవడం గుజరాత్ పేస్ దళానికి పెను సవాల్‌గా మారనుంది. అదే టైమ్‌లో జీటీ కూడా తమ బ్యాటింగ్ బలోపేతంపై ఎక్కువగా దృష్టి పెట్టింది.
షార్ట్ పిచ్ బంతులతోనే చెక్..?
గుజరాత్ బౌలింగ్‌కు మూల స్తంభాలైన మహ్మద్ సిరాజ్, కాగిసో రబాడ ఈ టోర్నీలో పవర్‌ప్లేలో మంచి వికెట్లు తీశారు. అయితే గతంలో సూర్యవంశీ వీళ్ల బౌలింగ్‌ను సైతం ఉతికేశాడు. కమిన్స్ వంటి దిగ్గజ బౌలర్లను సైతం లెక్కచేయకుండా సిక్సర్ల వర్షం కురిపించిన ఈ యంగ్ బ్యాటర్‌ను అడ్డుకుంటేనే జీటీ గెలుపును ఆశించొచ్చు. గత కొన్ని మ్యాచ్‌ల్లో సూర్యవంశీ షార్ట్ పిచ్ బాల్స్‌కు ఔట్ కావడంతో జీటీ పేస్ బలగం ఈ బలహీనతపైనే ఎక్కువగా దృష్టి సారించింది.
రాయల్స్ బ్యాటింగ్ బలం..
ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఎక్కువగా బ్యాటింగ్‌పైనే ఫోకస్ చేయనుంది. సూర్యవంశీ మెరుపులతో యశస్వి జైస్వాల్ ఆట మరుగునపడుతోంది. వన్‌డౌన్‌లో ధ్రువ్ జురెల్ కూడా రాణిస్తున్నా పెద్దగా లెక్కలోకి రావడం లేదు. ప్రస్తుతానికి ఈ టాప్–3పైనే ప్రత్యర్థి బౌలర్లు ఎక్కువగా దృష్టిపెట్టారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో రాజస్తాన్ బ్యాటింగ్ తడబడింది. ఈ లోపాలను కూడా సరిదిద్దుకుంటే కనీసం 250కి పైగా రన్స్ చేయొచ్చు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ మరోసారి కీలకం కానున్నాడు.
సమష్టిగా రాణిస్తేనే..
క్వాలిఫయర్–1లో బెంగళూరు చేతిలో ఓడిన గుజరాత్‌కు ఫైనల్ చేరేందుకు ఇదే చివరి అవకాశం. జట్టు బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్‌పైనే పడుతోంది. ఒకవేళ వీళ్లు విఫలమైతే తర్వాత ఆదుకునే బ్యాటింగ్ డెప్త్ జీటీకి లేకపోవడం మైనస్. నిశాంత సింధు, సుందర్, హోల్డర్ బ్యాట్లు ఝుళిపించాల్సిన టైమ్ వచ్చేసింది.
గత మ్యాచ్‌లో రాహుల్ తెవాటియా ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. కాకపోతే అతనికి రెండో ఎండ్‌లో సరైన సహకారం అందడం లేదు. లోయర్ ఆర్డర్‌లో రషీద్ ఖాన్, సిరాజ్, రబాడ కనీసం కొన్నైనా పరుగులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. ఫీల్డింగ్ లోపాలను జీటీ సరి చేసుకోవాల్సి ఉంది.
తుది జట్లు (అంచనా)
రాజస్తాన్: రియాన్ పరాగ్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, డొనోవాన్ పెరీరా, డాసున్ షనక, జడేజా, ఆర్చర్, నాండ్రీ బర్గర్, సుశాంత్ మిశ్రా, బ్రిజేష్ శర్మ, యష్ రాజ్ పూనియా.
గుజరాత్: గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, నిశాంత్, సుందర్, హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రబాడ, మానవ్ సుతార్/ సాయి కిశోర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
పిచ్, వాతావరణం
బ్యాటర్లకు అనుకూలం. ఇక్కడ జరిగిన గత మ్యాచ్‌లలో 220, 223 రన్స్ లక్ష్యాలను ఈజీగా ఛేదించారు. అయితే వరుస మ్యాచ్‌ల వల్ల పిచ్ ఇప్పుడు క్షీణతకు గురైంది. దాంతో బ్యాటర్లకు సవాల్ విసిరే అవకాశముంది. వర్షం ముప్పు ఉంది.
