దేవుడి ముందు అందరూ సమానమే.. దేవాలయాల్లో ‘వీఐపీ సంస్కృతి’పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

దేవుడి ముందు అందరూ సమానమే.. దేవాలయాల్లో ‘వీఐపీ సంస్కృతి’పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

చెన్నై: దేవాలయాల్లో నడుస్తున్న ‘వీఐపీ సంస్కృతి’పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడి ముందు భక్తులందరూ సమానమేనని, అక్కడ ప్రత్యేక వర్గాలంటూ ఎవరూ ఉండరని స్పష్టం చేసింది. ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. “ ఈ సృష్టిలో దేవుడొక్కడే అసలైన వీఐపీ. ఆయన ఎవరి కోసమూ వేచి ఉండరు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటూ ఎప్పుడు పడితే అప్పుడు ఆలయాల్లోకి వెళ్లడానికి వీల్లేదు” అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

 సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించేలా సాగుతున్న ప్రత్యేక దర్శనాల తీరును న్యాయస్థానం తప్పుబట్టింది. కేవలం ఆర్థిక స్థితిని బట్టి భక్తుల మధ్య వివక్ష చూపడం, వీఐపీల కోసం సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టడం భగవంతుడు కూడా క్షమించని తీవ్రమైన ఆధ్యాత్మిక పాపమని ఘాటుగా వ్యాఖ్యానించింది. 

ఒకవేళ వీఐపీల వల్ల సామాన్యులు ఇబ్బంది పడేతే అప్పుడు వారు పెట్టి శాపనార్థాలు, తిట్లు ఆ వీఐపీలకే చుట్టుకుంటాయని పేర్కొంది. డబ్బులు ఎక్కువ ఇచ్చే ధనవంతులను దేవుడి దగ్గరకు తీసుకెళ్లడం.. ఉచిత దర్శనం చేసుకునే పేదలకు దూరం నుంచి చూపించడం వంటి పద్ధతులు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు, మత స్వేచ్ఛ  నిబంధనలకు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.