IPL 2026 సీజన్లో మరో కీలక పోరు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. చండీగఢ్‌లో 70 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
దీంతో.. GT vs RR మధ్య శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే క్వాలిఫయర్-2 మ్యాచ్పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. రాజస్తాన్ రాయల్స్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించి ఇంటి బాట పట్టక తప్పదు. గుజరాత్ టైటాన్స్ జట్టు నేరుగా ఫైనల్కి వెళుతుంది.
అందువల్ల.. RR ఫైనల్కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ జరిగి.. గుజరాత్ జట్టును ఓడిస్తేనే సాధ్యపడుతుంది. ఇక.. పిచ్ విషయానికొస్తే.. బ్యాటర్లకు అనుకూలం. ఇక్కడ జరిగిన గత మ్యాచ్‌లలో 220, 223 రన్స్ లక్ష్యాలను ఈజీగా ఛేదించారు. అయితే వరుస మ్యాచ్‌ల వల్ల పిచ్ ఇప్పుడు క్షీణతకు గురైంది. దాంతో బ్యాటర్లకు సవాల్ విసిరే అవకాశముంది. వర్షం ముప్పు ఉంది.
క్వాలిఫయర్–1లో బెంగళూరు చేతిలో ఓడిన గుజరాత్‌కు ఫైనల్ చేరేందుకు ఇదే చివరి అవకాశం. జట్టు బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్‌పైనే పడుతోంది. ఒకవేళ వీళ్లు విఫలమైతే తర్వాత ఆదుకునే బ్యాటింగ్ డెప్త్ జీటీకి లేకపోవడం మైనస్. నిశాంత సింధు, సుందర్, హోల్డర్ బ్యాట్లు ఝుళిపించాల్సిన టైమ్ వచ్చేసింది.
గత మ్యాచ్‌లో రాహుల్ తెవాటియా ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. కాకపోతే అతనికి రెండో ఎండ్‌లో సరైన సహకారం అందడం లేదు. లోయర్ ఆర్డర్‌లో రషీద్ ఖాన్, సిరాజ్, రబాడ కనీసం కొన్నైనా పరుగులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. ఫీల్డింగ్ లోపాలను గుజరాత్ టైటాన్స్ సరి చేసుకోవాల్సి ఉంది.
ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఎక్కువగా బ్యాటింగ్‌పైనే ఫోకస్ చేయనుంది. సూర్యవంశీ మెరుపులతో యశస్వి జైస్వాల్ ఆట మరుగునపడుతోంది. వన్‌డౌన్‌లో ధ్రువ్ జురెల్ కూడా రాణిస్తున్నా పెద్దగా లెక్కలోకి రావడం లేదు. ప్రస్తుతానికి ఈ టాప్–3పైనే ప్రత్యర్థి బౌలర్లు ఎక్కువగా దృష్టిపెట్టారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో రాజస్తాన్ బ్యాటింగ్ తడబడింది. ఈ లోపాలను కూడా సరిదిద్దుకుంటే కనీసం 250కి పైగా రన్స్ చేయొచ్చు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ మరోసారి కీలకం కానున్నాడు.
