రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.50వేలు ఆదాయం కావాలా? ఎంత సేవింగ్స్ అవసరమో తెలుసా..?

రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.50వేలు ఆదాయం కావాలా? ఎంత సేవింగ్స్ అవసరమో తెలుసా..?

రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.50వేలు ఆదాయం ఉంటే చాలు.. హాయిగా బ్రతికేయవచ్చు అని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఆ రూ.50 వేలను స్థిరంగా పొందాలంటే మీ దగ్గర ఎంత సేవింగ్స్ ఉండాలో తెలిస్తే షాక్ అవుతారు. మీరు ఎంచుకునే విత్ డ్రాయల్ పద్ధతిని బట్టి ఈ కార్పస్ విలువ రూ. కోటి నుంచి ఏకంగా రూ.2కోట్ల 35లక్షల వరకు ఉండొచ్చని తాజా నివేదికలు చెబుతున్నాయి.

సాధారణంగా మనకు తెలిసిన అత్యంత సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు. అయితే నెలకు రూ.50 వేల చొప్పున ఏడాదికి రూ.6 లక్షల ఆదాయం పొందడానికి ఎఫ్‌డీలపై ఆధారపడితే.. రిటైర్మెంట్ సమయానికి మీ దగ్గర రూ.2కోట్ల 30 లక్షల నిధి ఉండాలి. ఇది మీ వార్షిక ఖర్చుకు దాదాపు 39 రెట్లు ఎక్కువ. అదే మీకు జీవితాంతం గ్యారెంటీ ఆదాయం కావాలనుకుంటే.. ఈ మొత్తం రూ.2కోట్ల 35లక్షలకు చేరుతుంది. అంటే కేవలం సేఫ్టీ వైపు మాత్రమే చూస్తే.. మీరు భారీగా కూడబెట్టాల్సి ఉంటుందని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.

స్టాక్ మార్కెట్ పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటే మీరు కూడబెట్టాల్సిన మొత్తం భారీగా తగ్గుతుంది. ఉదాహరణకు.. మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్(SWP) ద్వారా ఆదాయం పొందాలని భావిస్తే.. రూ. కోటి 60లక్షల కార్పస్ ఉంటే సరిపోతుంది. ఇది వార్షిక అవసరాలకు 27 రెట్లు. ఇందులో కాస్త రిస్క్ ఉన్నప్పటికీ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ కాలం ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

అన్నింటికంటే సమర్థవంతమైన మార్గంగా 'సైంటిఫిక్ పే' అనే ఫ్రేమ్‌వర్క్‌ను ఈ నివేదిక సూచించింది. ఈ పద్ధతిని పాటిస్తే కేవలం రూ.కోటి పొదుపుతోనే నెలకు రూ.50 వేల ఆదాయాన్ని సాధించవచ్చు. ఇది వార్షిక ఖర్చుకు కేవలం 17 రెట్లు మాత్రమే. అంటే సరైన వ్యూహాన్ని అనుసరిస్తే.. తక్కువ పెట్టుబడితోనే గౌరవప్రదమైన రిటైర్మెంట్ లైఫ్ గడపవచ్చు.

ముగింపుగా చెప్పాలంటే.. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది కేవలం ఒక నంబర్‌పై ఆధారపడి ఉండదు. ద్రవ్యోల్బణం, ఆశించిన రాబడి, మీరు ఎంచుకునే ఉపసంహరణ వ్యూహంపైనే మీ ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ పద్ధతుల్లో వెళ్తే ఎక్కువ కష్టపడి సంపాదించాల్సి వస్తుంది, అదే స్మార్ట్ స్ట్రాటజీలను ఎంచుకుంటే తక్కువ నిధితోనే మీ కలల రిటైర్మెంట్‌ను సాకారం చేసుకోవచ్చు.