ప్రపంచ స్థాయి విద్యనందిస్తామన్న కేంద్రం 

 ప్రపంచ స్థాయి విద్యనందిస్తామన్న కేంద్రం 
  • ఇకపై 200 చానళ్లలో టీవీ పాఠాలు
  • సొంత భాషల్లో వినేందుకు వీలు
  • స్కిల్స్ పెంచేందుకు ‘దేశ్’ పోర్టల్
  • అర్బన్ ప్లానింగ్ కోసం స్పెషల్ కోర్సు
  • 5 యూనివర్సిటీల్లో ప్రారంభం

న్యూఢిల్లీ: చదువులు అందరికీ అందేలా, ఆన్​లైన్​ క్లాసులు ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా డిజిటలైజేషన్​ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పిల్లలకు పాఠాలు ప్రసారమయ్యే చానళ్లను 200కు పెంచడంతో పాటు స్టూడెంట్లలో స్కిల్స్​ను పెంచేందుకు ఓ డిజిటల్​ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. స్టూడెంట్లందరికీ ప్రపంచ స్థాయి చదువులు అందేలా డిజిటల్​ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. దాని ద్వారా ఇంటి దగ్గర్నే సొంత భాషల్లో చదువుకునేందుకు, నేర్చుకునేందుకు వీలవుతుందన్నారు. ఈ యూనివర్సిటీని ‘హబ్​ స్పోక్​ మోడల్’​లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే యూనివర్సిటీ కేంద్రంగా ప్రతి స్టూడెంట్​కు అవసరమైన స్కిల్స్​ను నేర్పిస్తామని అన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలన్నీ దానితో డిజిటల్​ యూనివర్సిటీతో కొలాబరేట్​ కావొచ్చని ఆమె పేర్కొన్నారు. 
అందరికీ అందేలా..
కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది స్టూడెంట్లకు ఆన్​లైన్​ క్లాసులకు దూరమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పల్లెల్లో ఉండే స్టూడెంట్లు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన కులాల వారికి టీవీ పాఠాలు మరింత చేరువయ్యేలా ‘పీఎం ఈ–విద్య’లో భాగమైన ‘వన్​ క్లాస్​ వన్​ టీవీ చానల్​’ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తున్నట్టు నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఇప్పటిదాకా పాఠాలు చెప్తున్న 12 చానళ్లను 200కు పెంచుతున్నట్టు వెల్లడించారు. అందులో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి నుంచి 12 వరకు సొంత భాషల్లో పాఠాలు చెప్పేందుకు వీలవుతుందన్నారు. డిజిటల్​ టీచర్స్​ ద్వారా అత్యంత నాణ్యమైన ఈ–కంటెంట్​ను స్టూడెంట్లకు అందించేందుకు వీలవుతుందన్నారు. మొబైల్​ ఫోన్లు, టీవీ, రేడియోల ద్వారా కంటెంట్​ను అందించొచ్చన్నారు. 
‘దేశ్’​ పోర్టల్​ 
 స్టూడెంట్లలో స్కిల్స్​ పెంచేందుకు నేషనల్​ స్కిల్​ క్వాలిఫికేషన్​ ఫ్రేమ్​వర్క్​(ఎన్​ఎస్​ క్యూఎఫ్​)తో విద్యా, ఉపాధి రంగాన్ని అనుసంధానిస్తామని నిర్మలా సీతారామన్​ చెప్పారు. అందుకోసం డిజిటల్​ ఎకోసిస్టమ్​ ఫర్​ స్కిల్లింగ్​ అండ్​ లైవ్లీహుడ్​–  (ద దేశ్​ స్టాక్​ పోర్టల్​)ను ప్రారంభిస్తామన్నారు. ఆన్​లైన్​ ట్రైనింగ్​ ద్వారా ప్రజలు, స్టూడెంట్లలో స్కిల్స్​ను పెంచుతామని చెప్పారు. దాంతో పాటు సైన్స్​ అండ్​ మ్యాథ్స్​ కోసం  750 వర్చువల్​ ల్యాబ్స్​ ఏర్పాటు చేస్తామన్నారు. సిమ్యులేటెడ్​ లెర్నింగ్​ కోసం 75 స్కిల్లింగ్​ ఈ–ల్యాబ్స్​ను అందుబాటులోకి తెస్తామని ఆమె ప్రకటించారు. స్కిల్​ డెవలప్​మెంట్​లో భాగంగా డ్రోన్ల వాడకాన్ని పెంచేందుకుగానూ ‘డ్రోన్​ శక్తి’ ద్వారా స్టార్టప్​లను ప్రోత్సహిస్తామన్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ఐటీఐల్లో స్కిల్​ కోర్సులను ప్రారంభిస్తామన్నారు. 
ఎడ్యుకేషన్​ సెస్..​ బిజినెస్​ ఎక్స్​పెండిచర్​ కాదు
వివిధ ప్రభుత్వ పథకాలకు నిధుల సమీకరణ కోసం మాత్రమే ‘హెల్త్​ అండ్​ ఎడ్యుకేషన్​ సెస్​’ను సర్​చార్జీలాగా వసూలు చేస్తున్నామని నిర్మలా సీతారామన్​ స్పష్టం చేశారు. చట్టంలోని రూల్స్​ ప్రకారం ఆదాయం లేదా లాభాలపై విధించే ఏదైనా సర్​చార్జ్​గానీ, సెస్​ గానీ బిజినెస్​ ఎక్స్​పెండిచర్​ కిందకు రాదని తేల్చి చెప్పారు.  
అర్బన్​ ప్లానింగ్​ కోర్సు
మన దేశ అవసరాలకు తగ్గట్టు పట్టణాలు, నగరాలను అభివృద్ధి చేయడం కోసం ఐదు యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా అర్బన్​ ప్లానింగ్​ కోర్సును తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఆ యూనివర్సిటీలకు రూ.250 కోట్ల చొప్పున నిధులను కేటాయిస్తామన్నారు. కోర్సుకు సంబంధించిన సిలబస్​, నాణ్యత, ఇతర విద్యాసంస్థల్లో ప్లానింగ్​ కోర్సుల ప్రారంభం వంటి విషయాలను చూసుకునే అధికారాలను ఏఐసీటీఐకి ఇస్తున్నట్టు చెప్పారు.