రోజూ 50 వేల టెస్టులు చేయండి

రోజూ 50 వేల టెస్టులు చేయండి
  • హెల్త్ ఆఫీసర్లకు మంత్రి ఈటల ఆదేశం
  • ట్రేసింగ్‌‌, టెస్టింగ్‌‌, ట్రీటింగ్‌‌ పకడ్బందీగా చేయాలి
  • బార్డర్‌‌‌‌ జిల్లాల్లో అలర్ట్‌‌గా ఉండండి
  • 8 జిల్లాల ఆఫీసర్లతో టెలి కాన్ఫరెన్స్​లో కామెంట్స్

హైదరాబాద్, వెలుగు:  రాష్ర్టంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, రోజూ కనీసం 50 వేల టెస్టులు చేయాలని అధికారులను హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ ఆదేశించారు. ట్రేసింగ్‌‌, టెస్టింగ్‌‌, ట్రీటింగ్‌‌ పకడ్బందీగా చేయాలని సూచించారు. మహారాష్ర్ట, కర్నాటకలో కేసులు పెరుగుతుండటంతో మెడికల్ హెల్త్ ఆఫీసర్లతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తర్వాత సెక్రటేరియట్‌‌లోని తన చాంబర్‌‌‌‌లో స్టేట్ హెల్త్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. మహారాష్ర్ట బార్డర్‌‌‌‌లో ఉన్న నిజామాబాద్‌‌, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లతో ఈటల ఫోన్‌‌లో మాట్లాడారు. ఈ జిల్లాల నుంచి పక్క రాష్ర్టాలకు రాకపోకలు ఎక్కువగా ఉన్నందున అక్కడ టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌‌, మేడ్చల్ మల్కాజ్‌‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వైరస్ వ్యాప్తిపై అలర్ట్‌‌గా ఉండాలని సూచించారు. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, ఎగ్జామ్ హాల్స్‌‌లో కరోనా రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌మెంట్‌‌తో సమన్వయం చేసుకోవాలన్నారు. 102, 104, 108 వాహనాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని సూచించారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
ఆయుష్మాన్ అనుసంధానం షురూ చేయండి
ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాల అనుసంధానానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఈటల ఆదేశించారు. రెండు పథకాలను కలిపి అమలు చేస్తే వచ్చే సమస్యలపై చర్చించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. బడ్జెట్‌‌ సమావేశాల కోసం సిద్ధంగా ఉండాలని చెప్పారు. మెడికల్ కాలేజీల సివిల్ వర్క్స్‌‌, డయాలసిస్‌‌ సెంటర్లలో పేషెంట్ల రద్దీపై ఆరా తీశారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ రమేశ్‌‌రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్‌‌ రాజారావు, ఉస్మానియా సూపరింటెండెంట్‌‌ నాగేందర్‌‌‌‌, చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌ మహబూబ్‌‌ఖాన్‌‌  పాల్గొన్నారు. ఈ మధ్య గుండె ఆపరేషన్ చేయించుకుని రెండ్రోజుల క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌‌ అయిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.