ఆత్మహత్యలొద్దు.. అండగా ఉంటం

ఆత్మహత్యలొద్దు..  అండగా ఉంటం

సీఎం, మంత్రుల తీరుతోనే శ్రీనివాస్రెడ్డి ఆత్మహత్య
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: లక్ష్మణ్
సీఎం కేసీఆర్రాజీనామా చేయాలె: వివేక్
అందరం కలిసి పోరాడి సాధించుకోవాలి: కోదండరాం
సీఎం, మంత్రులపై కేసులు పెట్టాలె: రేవంత్రెడ్డి
సార్.. ఇప్పుడు లాభాలు తేవడం లేదేం?: రావుల
ఇకనైనా సర్కారు కళ్లు తెరవాలి: తమ్మినేని

హైదరాబాద్‌, వెలుగుఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడ వద్దని, తాము అండగా ఉంటామని పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు భరోసానిచ్చారు. సర్కారు పెద్దల రెచ్చగొట్టే విధానాల వల్లే డ్రైవర్​ శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని, అది పూర్తిగా ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. సీఎం, మంత్రులపై కేసులు పెట్టాలని, సీఎం కేసీఆర్​ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

ఆదివారం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో హాస్పిటల్​లో డ్రైవర్​ శ్రీనివాస్‌ రెడ్డి మృతదేహాన్ని బీజేపీ రాష్ట్ర చీఫ్​ కె.లక్ష్మణ్, వివేక్​వెంకటస్వామి, కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్​రెడ్డి, టీజేఎస్​ చీఫ్​ కోదండరామ్, టీడీపీ నేత రావుల, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి తదితరులు సందర్శించారు. శ్రీనివాస్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరవాలని, ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఇది ప్రభుత్వ హత్యే: కె.లక్ష్మణ్

ఖమ్మం జిల్లాకే చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌  మాటల వల్లే శ్రీనివాస్‌ రెడ్డి మనస్తాపానికి గురై, ఆత్మహత్యకు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర చీఫ్​ కె.లక్ష్మణ్​అన్నారు. శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్య వృథా కాదని, సర్కారు దిగొచ్చి డిమాండ్లను పరిష్కరిస్తుందని చెప్పారు. కార్మికులెవరూ ఆవేశపడవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వం ఎన్ని కవ్వింపు చర్యలు చేసినా, ఎంత రెచ్చగొట్టినా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని సూచించారు. ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల సమస్యలకు మాత్రమే సంబంధించిన విషయం కాదని, ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంగా భావిస్తున్నామని చెప్పారు. కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.

సీఎం, మంత్రులపై కేసులు పెట్టాలె: రేవంత్‌ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్ల, 50 వేల మంది డిస్మిస్‌ అయ్యారని ప్రకటించడం వల్లే ఆత్మబలిదానం చేస్తున్నట్టుగా డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి మేజిస్ట్రేట్‌ ముందు మరణ వాంగ్మూలం ఇచ్చారని ఎంపీ రేవంత్‌ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు పువ్వాడ, తలసాని తన చర్యకు కారణమని వాంగ్మూలంలో పేర్కొన్నారని.. దీనిని బట్టి  సీఎం, మంత్రులపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రెచ్చగొట్టే విధానం వల్లే శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మబలిదానం జరిగిందన్నారు. రాజ్యాంగంలో లేని సెల్ఫ్‌ డిస్మిస్‌ అనే పదాన్ని తీసుకొచ్చి కవ్విస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం నుంచి, ఆర్టీసీ నుంచి ప్రతినిధులు వచ్చి, శ్రీనివాస్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించాలని, 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాంతాచారి బలిదానం చేసుకున్నప్పుడూ డీఆర్‌డీవో నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని, శ్రీనివాస్‌ రెడ్డి సైతం అదే ఆస్పత్రిలో చనిపోయారని గుర్తు చేశారు.

పోరాడి సాధించుకుందాం: కోదండరాం

శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీజేఎస్‌ చీఫ్​ కోదండరాం చెప్పారు. తెలంగాణ సమాజం మొత్తం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కదులుతోందని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. చావు పరిష్కారం కాదని, పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికులను రెచ్చగొట్టేలా సీఎం, మంత్రులు మాట్లాడటం సమంజసం కాదని.. అసలు ఇప్పుడు మాట్లాడుతున్న మంత్రులెవరూ ఉద్యమంలో లేనివారే కావడం విచిత్రమని చెప్పారు. ఐక్యంగా పోరాడి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకోవాలని కార్మికులు, ఉద్యోగులకు సూచించారు.

సీఎంగా ఉండీ.. లాభాల్లోకి తేలేదేం?: రావుల

శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్య విషాదకరమని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు రావాలన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం బాధాకరమని, దీన్ని ప్రజాస్వామ్యంలో ఎవరూ హర్షించరని స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మె ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీనివాస్‌ రెడ్డి ఆశయ సాధనకు ఐక్యంగా పోరాడుదామని చెప్పారు. కేసీఆర్‌ రవాణా మంత్రిగా ఉన్నప్పుడు లాభాలు తెచ్చామన్నారని.. ఇప్పుడు ఏకంగా సీఎంగానే ఉన్నా లాభాల్లోకి ఎందుకు తెస్తలేరని నిలదీశారు.

ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవండి: తమ్మినేని

తన చావుకు కారణం ప్రభుత్వమేనని శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టంగా చెప్పారని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గాల్లో విహరిస్తున్న కేసీఆర్‌ నేల మీదకు రావాలని సూచించారు. కార్మికుల పీఎఫ్‌ సొమ్మును ప్రభుత్వం దొంగిలించిందని, ఇందుకు సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని చెప్పారు. వెంటనే డబ్బును కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్​ చేశారు.

ఎవరు డిస్మిస్‌ అవుతారో
ప్రజలే తేల్చుతరు: అశ్వత్థామరెడ్డి

సీఎం కేసీఆర్​ డిస్మిస్‌  అనే పదం వాడొద్దని, భవిష్యత్‌లో ఎవరు డిస్మిస్‌ అవుతారో ప్రజలే తేల్చుతారని అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఆస్పత్రిలో శ్రీనివాస్‌ రెడ్డిని కలిస్తే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులను కాపాడాలని కోరాడని వివరించారు. జడ్జికి కూడా ఇదే వాంగ్మూలం ఇచ్చానని చెప్పాడన్నారు. ఆర్టీసీ ఆస్తులు కొట్టేయాలనే ప్రయత్నం జరుగుతోందని.. తెలంగాణ ఆత్మగౌరవ పునాదులను మీద సామ్రాజ్యాలను విస్తరించుకున్నారని, త్వరలోనే అవి కుప్పకూలుతాయని చెప్పారు. విద్యాసంస్థల సెలవులు పొడిగించారంటేనే కార్మికులు నైతిక విజయం సాధించారని చెప్పారు. సోమవారం గవర్నర్​ అపాయింట్​మెంట్‌ కోరామని.. తనను కలిసి అన్నీ వివరిస్తామన్నారు.

విలీనం చేయాల్సిందే: మందకృష్ణ

ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్లే శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  అన్నారు. ఇది ముమ్మాటికీ సర్కార్‌ హత్యేనని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని శ్రీనివాస్‌ రెడ్డి కోరారన్నారు.

కేసీఆర్‌  రాజీనామా చేయాలె: వివేక్

శ్రీనివాస్‌ రెడ్డి మరణానికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్‌  రాజీనామా చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. నాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ఆత్మబలిదానానికి, ఇప్పుడు శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి రెండింటికీ ఇప్పుడున్న మంత్రులే కారణమన్నారు. కార్మికులు డిస్మిస్‌ అయ్యారని, దుబాయ్‌ నుంచి డ్రైవర్లను తీసుకొస్తామని చెప్తూ  సీఎం కేసీఆర్‌ కార్మికులను కవ్వించారని మండిపడ్డారు. కేసీఆర్‌  కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని, మరి సెల్ఫ్‌  డిస్మిస్‌ అని ఎక్కడా, ఏ చట్టంలో లేదన్న విషయం తెలియదా అని నిలదీశారు. మూడు రోజులుగా మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీలపై ఐటీ దాడులు జరుగుతున్నాయని.. మేఘా కృష్ణారెడ్డి సీఎం సన్నిహితుడు కావడంతో వాస్తవాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడి, కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్​చేశారు. సీఎం దిగిరాకుంటే మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.