ఈ ఏడాది సత్తాచాటలేకపోయిన అథ్లెట్స్

ఈ ఏడాది సత్తాచాటలేకపోయిన అథ్లెట్స్

టాప్‌‌ ప్లేయర్లకు గాయాలు.. డోపింగ్‌‌ వ్యవహారాలు.. ఏజ్‌‌ విషయంలో మోసాలు.. అంతర్జాతీయ ఈవెంట్లలో చతికిలపడిన పెర్ఫామెన్స్‌‌..! ఇలా ఈ ఏడాది అథ్లెటిక్స్‌‌లో.. ఇండియా అథ్లెట్లకు పెద్దగా కలిసి రాలేదు..! స్టార్‌‌ అథ్లెట్‌‌ ద్యుతీచంద్‌‌ ఒకటి, రెండు సంచలన పెర్ఫామెన్స్‌‌తో చరిత్ర సృష్టించినా.. నీరజ్‌‌ చోప్రా, హిమదాస్‌‌ గాయాలు.. పతకాల వేటలో ఇండియాను ఘోరంగా దెబ్బతీసింది..! మొత్తానికి మెరుపులను మించిన మరకల్లోనూ ఆరుగురు అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌‌కు క్వాలిఫై కావడం అతిపెద్ద సానుకూలాంశం..!!

ఇండియా అథ్లెటిక్స్‌‌‌‌లో అతిపెద్ద స్టార్లు ద్యుతీచంద్‌‌‌‌, హిమదాస్‌‌‌‌, నీరజ్‌‌‌‌ చోప్రా. కానీ ఈ ముగ్గురు ఈసారి పెద్దగా రాణించలేకపోయారు. ద్యుతీచంద్‌‌‌‌ ఓ మాదిరి పెర్ఫామెన్స్‌‌‌‌తో ఆకట్టుకున్నా..  హిమదాస్‌‌‌‌, నీరజ్‌‌‌‌ చోప్రాను గాయాలు వెంటాడాయి. దీంతో హాఫ్‌‌‌‌ సీజన్‌‌‌‌ పాటు ఆటకు దూరంగా ఉండటంతో.. ఈసారి ఇంటర్నేషనల్‌‌‌‌ స్థాయిలో ఇండియా పెర్ఫామెన్స్‌‌‌‌ అంతంతమాత్రంగానే ఉంది. ఇంత కష్టకాలంలోనూ ఓ ఆరు ఒలింపిక్‌‌‌‌ కోటాలు దక్కడం, అడ్మినిస్ట్రేషన్‌‌‌‌లో అథ్లెటిక్స్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా ప్రెసిడెంట్‌‌‌‌ అదిలి సుమరివాలా.. రెండోసారి వరల్డ్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌లో మెంబర్‌‌‌‌గా ఎన్నికవ్వడం కాస్త సంతోషాన్నిచ్చాయి.

మెరుపులివే..

ఈ ఏడాది స్టార్‌‌‌‌ అథ్లెట్‌‌‌‌ ద్యుతీచంద్‌‌‌‌ కొత్త చరిత్ర సృష్టించింది. జూలైలో జరిగిన వరల్డ్‌‌‌‌ యూనివర్సిటీ గేమ్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలిచిన తొలి ఇండియన్‌‌‌‌ అథ్లెట్‌‌‌‌గా రికార్డులకెక్కింది. మహిళల 100 మీటర్ల ఈవెంట్‌‌‌‌లో బరిలోకి దిగిన ద్యుతీ 11.32 సెకన్లలో టార్గెట్‌‌‌‌ను చేరి కొత్త రికార్డు సృష్టించింది. అయితే తాను మరో అమ్మాయితో రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఉన్నానంటూ ద్యుతి స్వయంగా ప్రకటించి సంచలనం రేపింది. ఇక వచ్చే ఏడాది ఒలింపిక్స్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటివరకు ఇండియాకు అథ్లెటిక్స్‌‌‌‌లో ఆరు బెర్త్‌‌‌‌లు దక్కాయి. పురుషుల 20 కిలో మీటర్ల రేస్‌‌‌‌ వాక్‌‌‌‌లో కేటీ ఇర్ఫాన్‌‌‌‌, 300 మీటర్ల స్టీపుల్‌‌‌‌ ఛేజ్‌‌‌‌లో అవినాశ్‌‌‌‌ సాబ్లీ, మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ 4X100 మీ. రిలేలో మహ్మద్‌‌‌‌ అనాస్‌‌‌‌, వీకే విస్మయ, జిస్నా మాథ్యూ, నోహటమ్‌‌‌‌.. ఒలింపిక్స్‌‌‌‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

వెంటాడిన డోపింగ్‌‌‌‌ వివాదాలు

ఇండియా అథ్లెటిక్స్‌‌‌‌లో డోపింగ్‌‌‌‌ ప్రముఖంగా మారిపోయింది. ఈ ఏడాది 20 మంది అథ్లెట్లు డోప్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. దీంతో దేశంలోనే మూడో అత్యంత చెత్త క్రీడగా అథ్లెటిక్స్‌‌‌‌ నిలిచింది. గోమతి మరిముత్తు డోప్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో విఫలంకావడంతో ఏషియన్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ 800 మీటర్ల ఈవెంట్‌‌‌‌లో ఆమె సాధించిన గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను వెనక్కు తీసుకున్నారు. ఏషియన్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలిచిన సంజీవని జాదవ్‌‌‌‌ కూడా డ్రగ్స్‌‌‌‌ వాడినట్టు తేలడంతో ఆమెపై సస్పెన్షన్‌‌‌‌ వేటు పడింది. షాట్‌‌‌‌పుటర్‌‌‌‌ మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌పై నాడా ఏకంగా నాలుగేళ్ల నిషేధం విధించింది. డోపింగ్‌‌‌‌ అంశంతో పాటు ఏజ్‌‌‌‌ మోసాలు కూడా ఈ ఏడాది ప్రకంపనలు రేపాయి. నైపుణ్యాన్ని వెలికితీయడం కోసం నేషనల్‌‌‌‌ ఇంటర్‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌ జూనియర్‌‌‌‌ మీట్‌‌‌‌ పేరుతో నిర్వహించిన వరల్డ్‌‌‌‌ బిగ్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌లో 51 మంది యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ అడ్డంగా దొరికిపోయారు. తప్పుడు ఏజ్‌‌‌‌ సర్టిఫికెట్లు చూపించి పరీక్షలకు హాజరయ్యారు. కానీ ఆధునికమైన పరీక్షల్లో వీళ్ల వయసు బయటపడటంతో అందర్నీ పక్కనబెట్టేశారు. ఏజ్‌‌‌‌ విషయంలో దొరికిపోతామని మరో 169 మంది పరీక్షలకు కూడా హాజరుకాకపోవడం ఇదో విడ్డూరం. ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని గుంటూరులో నిర్వహించిన నేషనల్‌‌‌‌ జూనియర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లోనూ మరో 100 మంది పట్టుబడ్డారు. రాయ్‌‌‌‌పూర్‌‌‌‌లో జరిగిన నేషనల్‌‌‌‌ యూత్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇంకో 50 మంది ఓవర్‌‌‌‌ ఏజ్‌‌‌‌ కారణంగా పట్టుబడ్డారు.

పాపం నీరజ్‌‌‌‌, హిమ

గతేడాది జావెలిన్‌‌‌‌ త్రోలో ఇండియాకు అతిపెద్ద ఫలితాలను అందించిన స్టార్‌‌‌‌ త్రోయర్‌‌‌‌ నీరజ్‌‌‌‌ చోప్రా.. ఈ ఏడాది గాయాలతో ఇబ్బందిపడ్డాడు. పటియాలలో ట్రెయినింగ్‌‌‌‌లో ఉండగా 22 ఏళ్ల నీరజ్‌‌‌‌ కుడి మోచేతికి గాయమైంది. మే నెలలో ఆపరేషన్‌‌‌‌ కూడా చేయించుకున్నాడు. దీంతో రిహాబిలిటేషన్‌‌‌‌ ప్రోగ్రామ్స్‌‌‌‌ కారణంగా తర్వాతి సీజన్‌‌‌‌కు దూరమయ్యాడు. ఏషియన్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌, వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లోనూ బరిలోకి దిగలేకపోయాడు. దీంతో ఇండియాకు రెండు మెడల్స్‌‌‌‌ మిస్సయ్యాయి. ఇక మహిళల 100 మీటర్లలో కచ్చితంగా ఇండియాకు పతకం తెచ్చే అథ్లెట్‌‌‌‌ హిమదాస్‌‌‌‌. ప్రారంభంలో కొన్ని ఈవెంట్లలో సత్తా చాటినా.. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో సగం సీజన్‌‌‌‌కు దూరమైంది.యూరప్‌‌‌‌లో కొంతకాలం శిక్షణ తీసుకున్న హిమ.. చెక్‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌, పొలెండ్‌‌‌‌లో జరిగిన పోటీల్లో వరుసగా ఆరు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ సాధించింది. అయితే గాయం కారణంగా 400 మీటర్ల రేసును పూర్తి చేయకపోవడంతో ఏషియన్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌కు దూరమైంది. దీంతో పాటు వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌కు వెళ్లే టీమ్‌‌‌‌ నుంచి హిమ చివరి నిమిషంలో తప్పుకుంది.

అంచనాలను మించారు..

సెప్టెంబర్‌‌-అక్టోబర్‌‌లో దోహాలో జరిగిన వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా అథ్లెట్లు అంచనాలకు మించి రాణించారు. 27 మందితో కూడిన టీమ్‌‌ పతకాలు పెద్దగా సాధించ లేకపోయినా.. పెర్ఫామెన్స్‌‌లో  మాత్రం అదుర్స్‌‌ అనిపించింది. మిక్స్‌‌డ్‌‌ 4X100 రిలే, మెన్స్‌‌ 300 మీటర్ల స్టీపుల్‌‌ ఛేజ్‌‌, మహిళల జావెలిన్‌‌ త్రో టీమ్‌‌లు ఫైనల్స్‌‌కు చేరి ఆశలు రేకెత్తించాయి. ఇందులో స్టీపుల్‌‌ ఛేజర్‌‌ అవినాశ్‌‌ సాబ్లీతో పాటు 400 మీటర్ల రిలే టీమ్‌‌ టోక్యో ఒలింపిక్స్‌‌ బెర్త్‌‌ను దక్కించుకున్నాయి. వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ జావెలిన్‌‌ త్రో ఫైనల్స్‌‌కు అర్హత సాధించిన తొలి ఇండియన్‌‌ మహిళగా నిలిచిన అన్ను రాణి.. ఎనిమిదో స్థానంతో ముగించి నిరాశపర్చింది. కానీ పెర్ఫామెన్స్‌‌ పరంగా చూస్తే  తన పేరు మీద ఉన్న నేషనల్‌‌ రికార్డును మూడు రోజుల్లో రెండుసార్లు తిరగరాసి శభాష్‌‌ అనిపించింది.