ఓ మంచి డ్రైవర్ : బస్సులో మొక్కలు పెంచుతున్నాడు

ఓ మంచి డ్రైవర్ : బస్సులో మొక్కలు పెంచుతున్నాడు

మొక్కలు అందరూ నాటుతారు. ఇంటి ముందో.. పెరట్లోనే… చెట్లు పెట్టడం సాధారణం. హరితహారం నిర్వహించినప్పుడు.. రోడ్డుకు అటు ఇటూ మొక్కలు నాటడం చూస్తూనే ఉంటాం. కానీ.. అక్కడో డ్రైవర్ ఉన్నాడు. ఆయన చేస్తున్న ప్రకృతి సేవ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

ఆయన పేరు నారాయణప్ప. కర్ణాటక రాష్ట్రం… బెంగళూరు మెట్రోపాలిటన్ ఆర్టీసీ సంస్థలో డ్రైవర్. బెంగళూరు అంటేనే గార్డెన్ సిటీ అని పేరు. ఆ పేరును సార్థకం చేస్తూ పచ్చని యజ్ఞం చేస్తున్నాడు ఈ డ్రైవర్. బస్సులోనే మొక్కలు పెంచుతున్నాడు నారాయణప్ప. డ్రైవర్ సీట్ చుట్టూ.. కుండీల్లో మొక్కలు పెట్టి.. నీళ్లు పోసి పెంచుతున్నాడు. బస్సు ముందు నుంచి చూసేవాళ్లంతా వావ్ అంటున్నారు.

రెగ్యులర్ గా.. నారాయణప్ప.. కావల్ బిలసంద్రా, యశ్వత్ పూర్ మధ్య షటిల్ సర్వీస్ నడుపుతుంటాడు. ఆ ప్రాంతంలో తిరిగే ప్యాసింజర్లకు నారాయణప్ప బాగా తెలుసు. పచ్చదనం పెంచాలి… అనేదే తాను ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ అంటున్నాడు నారాయణప్ప. పర్యావరణాన్ని పచ్చగా ఉంచాలనే ఉద్దేశంతో… సీజనల్ గా తాను గడిచిన 3, 4 ఏళ్లనుంచి ఇలా బస్సులోనే మొక్కలు పెంచుతున్నట్టు వివరించాడు. పెరిగిన మొక్కలను మరోచోట నాటుతాననీ… కొత్త మొక్కలను మళ్లీ బస్సులోనే నీళ్లు పోసి పెంచుతానని చెప్పాడు.

బెంగళూరు ఆల్రెడీ చల్లగానే ఉంటుంది. తన ప్రయత్నం కొందరిలో అయినా మార్పు తీసుకురావాలన్నదే తన తపన అని చెప్పాడు ఆ ప్రకృతి ప్రేమికుడు.