కరోనా కారణంగా 8 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వాయిదా: ఈసీ

కరోనా కారణంగా 8 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వాయిదా: ఈసీ

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వేర్వేరు రాష్ట్రాల్లో జరగాల్సిన 8 నియోజకవర్గాల ఉపఎన్నికలను 45 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది భారత ఎన్నికల సంఘం. బీహార్‌లోని వాల్మీకి నగర్ పార్లమెంటు నియోజకవర్గం సహా అస్సాంలోని సిబ్‌సాగర్, తమిళనాడులోని తిరువోట్టియూర్, గుడియయట్టం, మధ్యప్రదేశ్‌లోని అగర్, ఉత్తరప్రదేశ్‌లోని బులంధ్‌హర్, తుంద్లా, కేరళలోని చవరా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించడమంటే ప్రజల ఆరోగ్యాన్ని, భద్రతను రిస్క్‌లో పెట్టడమేనని ఈసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఉప ఎన్నికలను సెప్టెంబర్ 7 వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరిస్థితులు ఎప్పుడు చక్కబడితే అప్పుడు వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. ఏదైనా నియోజకవర్గంలో సిట్టింగ్ సభ్యుడు మరణించినా, లేదా ఇతర కారణాల చేత ఖాళీ అయినా ఆ స్థానానికి ఆరు నెలల లోపు ఉప  ఎన్నిక నిర్వహించాలని, అయితే అనివార్య పరిస్థితుల్లో ఏడాది అంతకన్నా ఎక్కువ సమయం కూడా తీసుకోవచ్చని పేర్కొంది. మరోవైపు, బీహార్, అస్సాం వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో పలు జిల్లాల్లో అధికారులంతా సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారని, ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యమని ఈసీ అధికారులు తెలిపారు. ఇటు కరోనా, అటు వరదల కారణంగా ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.