మాజీ ఎంపీ రాయపాటి ఇండ్లలో ఈడీ సోదాలు

మాజీ ఎంపీ రాయపాటి ఇండ్లలో ఈడీ సోదాలు

హైదరాబాద్‌, వెలుగు: టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, వ్యాపారవేత్త మలినేని సాంబశివరావు ఇండ్లు, ఆఫీసుల్లో మంగళవారం ఈడీ సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్ 27లోని రాయపాటి సాంబశివరావు ఇంటితోపాటు గుంటూరులోని నివాసంలో కూడా సోదాలు చేసింది. ఆడిట్‌ రికార్డ్స్‌,హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. 

రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ, పవర్ ప్రాజెక్ట్‌లో మలినేని సాంబశివరావు కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఈ కంపెనీ పేరుతో 13 బ్యాంకుల నుంచి రూ. 9,394 కోట్లు లోన్‌ తీసుకుని మనీలాండరింగ్‌కు పాల్పడిందని గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఎనిమిది షెల్‌ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించింది.  ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ల ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్, గుంటూరులోని తొమ్మిది ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.  బోగస్ కంపెనీల ద్వారా నిధులు దారిమళ్లించినట్లు ఈడీ గుర్తించింది.