ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్​లు

ముక్క లేదు..  సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్​లు
  • కులాలు, వర్గాలవారీగా ఆత్మీయ సమ్మేళనాల్లేవ్ 
  • ఇంటింటి ప్రచారమూ లేదు
  • సోషల్ మీడియాపైనే అభ్యర్థులు, పార్టీల ఫోకస్​
  • సోషల్ జస్టిస్, దేశభద్రత లాంటి విధానపరమైన అంశాలపైనే చర్చ
  • కార్నర్​ మీటింగులు, బహిరంగ సభలతో సరి 
  • లోక్​సభ ఎన్నికల్లో సగానికి సగం తగ్గనున్న ఖర్చు 
  • సమాజానికి మంచిదంటున్న ప్రజాస్వామికవాదులు   

హైదరాబాద్, వెలుగు: ఎన్నికలంటేనే సుక్క, ముక్క.. పొద్దంతా ఇంటింటి ప్రచారాలు, పొద్దుగూకినంక మందు దావత్ లు.. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం చికెన్ రైస్.. కుల, మహిళ, యువజన, తదితర సంఘాలతో మీటింగులు.. గుళ్లు, మసీదులు, చర్చిలు, కమ్యూనిటీ భవనాలు, ఫంక్షన్​హాళ్లకు లక్షల్లో చందాలు.. గోడ దూకి వచ్చే నేతలకు పరపతిని బట్టి పైసలు.. పోలింగ్ ముందురోజు ఓటుకింత లెక్కగట్టి ఇచ్చే నోట్లు.. గత పదేండ్లుగా రాష్ట్రంలో ఎన్నికలంటే దాదాపు ఇట్లనే ఉండేవి! క్యాండిడేట్​ను ప్రకటించింది మొదలు ఓటరు ఈవీఎం మీట నొక్కేదాకా కోట్లకు కోట్లు ఖర్చయ్యేవి. గత లోక్​సభ ఎన్నికలతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థుల సరాసరి ఖర్చు  వంద కోట్లు దాటిన పరిస్థితి ఉండేది. 


ఇన్ని కోట్లు కుమ్మరించినా ఇటీవల కొందరు అభ్యర్థులు గెలవలేదు. పైగా కాంగ్రెస్ నుంచి ఏమాత్రం ఖర్చుచేయని పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఘన విజయం సాధించడం సంచలనం సృష్టించింది. దీంతో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల ప్రచార శైలి పూర్తిగా మారిపోయింది. అభ్యర్థులు సైతం ఇంటింటి ప్రచారంపై కాకుండా సోషల్ మీడియా క్యాంపెయినింగ్, కార్నర్​మీటింగుల ద్వారానే ఓటర్ల మైండ్​సెట్ మార్చడంపై ఫోకస్​పెట్టడంతో ఈసారి ఎన్నికల ఖర్చు సగానికి సగం తగ్గుతోంది. మారుతున్న ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఉప ఎన్నికల్లో ఖర్చు పీక్స్​కు 

హుజూర్​నగర్, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు బైఎలక్షన్ల టైంలో గెలుపోటములు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో అభ్యర్థుల ప్రచార ఖర్చు పీక్స్​కు చేరింది. పైసలిచ్చి పార్టీలను మార్పించడం కామన్ అయింది. గోడ దూకే నేతలకు పరపతిని బట్టి రూ.10 లక్షల దాకా చెల్లించిన దాఖలాలున్నాయి. కులపెద్దలతో మీటింగులు, ఓట్లను బట్టి సెటిల్మెంట్లు కామన్​అయ్యాయి. 

గుళ్లు, మసీదులు, చర్చిలు, కుల భవనాలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా చందాలివ్వడం పరిపాటిగా మారింది. ఫలితంగా అభ్యర్థుల ఎన్నికల ఖర్చు అంతకుముందుతో పోలిస్తే నాలుగైదు రెట్లు పెరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనైతే జనరల్ స్థానాల్లో ఒక్కో అభ్యర్థి రూ.100 కోట్లకుపైగా, రిజర్వుడ్​స్థానాల్లోనూ రూ.50 కోట్లు, ఆపైన ఖర్చు పెట్టారనే వార్తలు వచ్చాయి.  

సోషల్​మీడియాతో మారిన సీన్ 

పైసలతో ఓటర్లను ప్రలోభపెట్టడం ద్వారా ఎలాగైనా గెలువచ్చని  బీఆర్ఎస్ కొన్నేండ్లుగా​భావిస్తూ వచ్చింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్​అయ్యింది. పోలీసుల సాయంతో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్​చేసి, వాళ్ల డబ్బును ఎక్కడికక్కడ సీజ్ చేసిన బీఆర్ఎస్.. అవే పోలీస్​వాహనాల్లో తన డబ్బు తరలించి, జనాలకు పంచినా గెలవలేకపోయింది. ఓటర్లకు డబ్బు, కుల సంఘాలకు చందాలు ఇచ్చే పరిస్థితి లేని కాంగ్రెస్​మాత్రం సోషల్​మీడియాతో వ్యూహాత్మంగా ముందుకెళ్లి సక్సెస్​అయింది. క్రియేటివ్​యాడ్స్​తో మెయిన్​స్ట్రీమ్, సోషల్​మీడియాను ముంచెత్తింది. 

బీఆర్ఎస్​పాలనా వైఫల్యాలను ఎత్తిచూపడంతోపాటు తాము అధికారంలోకి వస్తే తెచ్చే మార్పులను విడమర్చి చెప్పింది.  ‘మార్పు కావాలి.. కాంగ్రెస్​రావాలి..’ అనే నినాదంతో హోరెత్తించింది. దీంతో వేములవాడ, ధర్మపురి, చొప్పదండి, ఖానాపూర్, తుంగతుర్తి లాంటి నియోజకవర్గాల నుంచి ఆదిశ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, మేడిపల్లి సత్యం, వెడ్మ బొజ్జు, మందుల సామేల్​లాంటి లీడర్లు.. ఓటర్లకు డబ్బు పంచకుండానే ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ఎన్నికల క్యాంపెయినింగ్​పై పార్టీల వైఖరి మారిందని పొలిటికల్ ఎక్స్​పర్ట్స్​చెప్తున్నారు. అందుకు తగినట్లే ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ సోషల్​మీడియా క్యాంపెయినింగ్​కే ప్రయారిటీ ఇస్తున్నాయి.  

ఎండల ఎఫెక్ట్.. కార్నర్​మీటింగులకే మొగ్గు  

ఇంటింటి ప్రచారానికి పెద్దమొత్తంలో ఖర్చవుతుండడానికి తోడు ఈసారి ఎండలు మండిపోతుండటంతో ప్రస్తు త పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు రూట్​మార్చారు. ఎండల కారణంగా కార్యకర్తలు బయటకు రాకపోవడం.. జన సమీకరణ కూడా కష్టంగా మారడంతో కేవలం బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్​లతో సరిపెడ్తున్నారు. భారీ బహిరంగ సభలకు వేలాదిగా జనాన్ని తరలించాలంటే కోట్లలో ఖర్చవుతుండడంతో ఒకటి, రెండు సభలతో సరిపెట్టి, రోడ్​షోలు, కార్నర్​మీటింగులకు ప్రయారిటీ ఇస్తున్నారు. సమావేశాల్లోనూ లోకల్​ఇష్యూస్​ను పక్కనపెట్టి జాతీయ అంశాలమీదే మాట్లాడుతున్నారు. ఈ తరహా రోడ్​షోలకు పెద్దగా జనాలను తరలించాల్సిన అవసరం లేకపోవడంతో ఆ మేరకు పెద్దమొత్తంలో ఖర్చు ఆదా అవుతోందని అభ్యర్థులు అంటున్నారు. 

పాంప్లెట్లు.. ప్రచార వాహనాలూ లేవ్ 

ఈసారి సోషల్​మీడియా కేంద్రంగానే ప్రచారం సాగుతుండడంతో పార్టీలు ఇంటింటి ప్రచారాన్ని బంద్​పెట్టాయి. గతంలో ఇంటింటి ప్రచారం చేసేవాళ్లకు రూ.500, బీర్, బిర్యానీ కామన్​గా ఉండేవి. ఇప్పుడు ఇంటింటి ప్రచారమూ లేదు. బీర్, బిర్యానీ, నోట్ల పంపకమూ లేదు. ఇంటింటి ప్రచారం ఆపేయడం వల్ల  అభ్యర్థులకు ఒక్కో మండలానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు మిగులుతున్నాయి.

 కుల సంఘాలు, మత పెద్దలతో మీటింగులు లేకపోవడంతో కమ్యూనిటీ, ఫంక్షన్​హాళ్ల ఖర్చులు.. గుళ్లు, మసీదులు, చర్చిలకు చందాలు బందయ్యాయి. ఈసారి అభ్యర్థులు వాల్​రైటింగ్స్, పాంప్లెట్స్, ఫ్లెక్సీలు, స్టిక్కర్ల​సంగతి కూడా మరిచిపోయారు. ప్రస్తుతం ఎక్కడా వాల్​రైటింగ్స్​జాడ లేదు. బ్యానర్లు, ఫ్లెక్సీలు కూడా అరుదుగా తప్ప కనిపించడం లేదు. ఊరూరా మైకులతో మోతెక్కించే ప్రచార వాహనాలనూ బంద్​పెట్టారు. 

గత పదేండ్లలో ఓట్లంటే కోట్లు

గడిచిన పదేండ్లలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవ డమే లక్ష్యంగా జరిగిన క్యాంపెయినింగ్ తో ఎన్నికల ఖర్చు అమాంతం పెరిగిపోయింది. ప్రతి100 మంది ఓటర్లకు ఒక ఇన్​చార్జిని నియమించే కొత్త సంస్కృతికి బీఆర్ఎస్ తెరలేపింది. బీఆర్ఎస్​ను చూసి మిగిలిన పార్టీల అభ్యర్థులు కూడా ఇదే బాట పట్టారు. పోలింగ్ జరిగే దాకా ఒక్కో ఓటరును నాలుగైదు సార్లు కలిసేవారు. ఒక్కొక్కరికి రూ.500 దాకా చెల్లించడంతో పాటు ప్రచారం జరిగినన్ని రోజులు ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం నాన్​వెజ్ భోజనాలు, సాయంత్రం మందు, విందు ఏర్పాటు చేసే వారు. 

ఇందుకోసం గ్రామాల్లో ప్రత్యేకంగా లిక్కర్ డంపులు వెలిసేవి. ప్రచారం జరిగినన్ని రోజులు పల్లె, పట్నం అనే తేడా లేకుండా జనాన్ని మత్తులో ముంచేసేవారు. పోలింగ్​ముందురోజు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల దాకా పంచేవారు. 2018 అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే సీన్​కనిపించింది. దీంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి  సగటు ఎన్నికల ఖర్చు రూ.50 కోట్లు, ఎంపీ అభ్యర్థి ఖర్చు రూ.100 కోట్లు దాటినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

ఎన్నికల ఖర్చు మరింత తగ్గాలి

 రాష్ట్రంలో మునుగోడు, హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో ఓటుకు ఐదారు వేలు పంచిన సందర్భాలు చూశాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ నోట్ల ప్రవాహం జరిగింది. కానీ గతంతో పోలిస్తే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు తగ్గించుకుంటున్నట్లు కనిపిస్తోంది. రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్ లు, బహిరంగ సభలకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగా కులాలవారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఈసారి పెద్దగా నిర్వహించడం లేదు. ఓటుకు నోట్లు పంచడం కూడా పెద్దగా ఉండకపోవచ్చని అనిపిస్తోంది. ఈ ఎన్నికల్లాగే కేవలం ప్రచారం ఆధారంగానే అసెంబ్లీ ఎన్నికలు జరిగే రోజు కూడా రావాలి. ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టి ఖర్చును మరింత తగ్గేలా చూడాలి. 

గుగులోత్ వీరన్న నాయక్,రిటైర్డ్ ప్రొఫెసర్ (పొలిటికల్ సైన్స్)  

పాలసీ మ్యాటర్స్ పై చర్చ బాగుంది 

ఈసారి లోక్​సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో విధానపరమైన అంశా ల మీద చర్చ జరగడం బాగుంది. కాంగ్రెస్.. సోషల్ జస్టిస్, ముస్లిం మైనార్టీల సమస్యలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ, బీజేపీకి మెజార్టీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, మోదీ నియంతృత్వంలాంటి అంశాలు ఎజెండాగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ఆర్థిక, సామాజిక సమస్యలపై ఎక్కువ దృష్టి పెడితే.. బీజేపీ మాత్రం దేశభద్రత, వన్ నేషన్- వన్ ఎలక్షన్, రామాలయం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మెజార్టీ ప్రజల హక్కులు ప్రమాదంలో పడతాయంటూ క్యాంపెయిన్ చే స్తోంది. వాస్తవానికి దీనిపై దేశమంతా ప్రజాస్వా మిక చర్చ జరుగుతోంది. ఈసారి డబ్బు ఖర్చు మీద దృష్టి పెట్టకుండా పార్టీలు తమ విధానాలేంటో చెప్పుకుని ఓట్లు అడగడం బాగుంది.  

 ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, కాకతీయ యూనివర్సిటీ