గిగ్ వర్కర్స్ కోసం త్వరలో కొత్త చట్టం తీసుకొస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

గిగ్ వర్కర్స్ కోసం త్వరలో కొత్త చట్టం తీసుకొస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఆదివారం ( జులై 6 ) గోదావరిఖనిలో మంత్రి వివేక్ వెంకటస్వామికి సన్మానం చేశారు కార్మిక సంఘాల నాయకులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి.రాహుల్ గాంధీ ఆలోచన అనుగుణంగా కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తానని అన్నారు. గిగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని.. త్వరలో కొత్త చట్టం తీసుకువస్తామని అన్నారు వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి పేదల సొంతింటి కల నెరవేరే విధంగా కృషి చేస్తానని అన్నారు మంత్రి వివేక్.

 కార్మికుల సమస్యలు పరిష్కారించేందుకు తమ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని.. సింగరేణి ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. అక్రమ ఇసుక దందాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అన్నారు మంత్రి వివేక్. ఇసుక దందాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చిస్తానని.. ఇసుక ద్వారా సుమారు రూ. 3 వేల కోట్ల పన్ను రావాల్సి ఉండగా కేవలం రూ. 600 కోట్ల రూపాయలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రానికి రావలసిన ఆదాయం ఎటు పోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని తెప్పించి ప్రజలకు మేలు జరిగేలా చూస్తానని అన్నారు మంత్రి వివేక్. 

ALSO READ | తీరిన చెన్నూర్ ప్రజల చిరకాల వాంఛ.. హైదరాబాద్-చెన్నూరు బస్ సర్వీస్ ప్రారంభించిన మంత్రి వివేక్

సింగరేణి సంస్థను కాపాడడంతో పాటు పెన్షన్ ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామిదని అన్నారు. కాకా నిరంతరం కార్మికుల సంక్షేమం కోసం,పేద ప్రజల కోసం ఆలోచించేవారని అన్నారు మంత్రి వివేక్. జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకవచ్చారని.. గడ్డం కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేస్తూ ఉంటుందని అన్నారు. కాకా కుటుంబంపై ఇంతటి ప్రేమను చూపిన ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. కాకా బాటలోనే ఎంపీ వంశీ కార్మికుల సమస్యలపై పార్లమెంట్ లో గళం విప్పటం జరిగిందని అన్నారు. 

కిరణ్ కుమార్ సీఎంగా ఉన్నపుడు తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నానని అన్నారు మంత్రి వివేక్. విశాఖ చారిటబుల్ ట్రస్ట్, వెంకటస్వామి ఫాండేషన్ ద్వారా నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నామని.. ఎంపీగా ఉన్న సమయంలో రామగుండం ఎరువుల కర్మాగారం తిరిగి ఓపెన్ చేయడంతో పాటు రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి చేయడం జరిగిందని అన్నారు.