టాలీవుడ్ నటి హేమ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి శ్రీమతి కోళ్ల లక్ష్మి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలోని స్వస్థలం రాజోలులో తుదిశ్వాస విడిచారు. హేమ తల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
అనారోగ్యం కారణంగా కొంతకాలంగా రాజోలులోనే చికిత్స పొందుతున్న లక్ష్మి .. ఊహించని విధంగా కన్నుమూశారు. విషయం తెలియగానే హేమ హుటాహుటిన రాజోలు చేరుకున్నారు. ఉదయం వరకు నాతో బాగానే మాట్లాడిన అమ్మ... ఒక్కసారిగా దూరం కావడం నమ్మలేకపోతున్నాను అంటూ భావాద్వేగానికి లోనయ్యారు. తల్లి మృతదేహంపై పడి హేమ విలపించారు. కోళ్ల లక్ష్మి గారి అంత్యక్రియలు ఆమె స్వగ్రామంలోనే నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.
గత కొంతకాలంగా హేమ సినిమాలకు దూరంగా ఉన్నారు. గతేడాది బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీ సంఘటనతో ఆమె వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆ పార్టీలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొని, పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె జైలు జీవితం గడపాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన తర్వాత, హేమ పలు ఇంటర్వ్యూలలో తన తల్లి ఆరోగ్యం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. తాను జైలుకు వెళ్లడం చూసి మా అమ్మ తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి ఆమె మానసికంగా, శారీరకంగా బలహీనపడింది. నేను తప్పు చేయకపోయినా, ఈ నింద మా కుటుంబాన్ని, ముఖ్యంగా మా అమ్మను తీవ్రంగా కుంగదీసింది అని హేమ గతంలో కన్నీరు పెట్టుకున్నారు.
