T20 World Cup 2026: ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే భారీగా నష్టపోతారు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ వార్నింగ్

T20 World Cup 2026: ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే భారీగా నష్టపోతారు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ వార్నింగ్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 15న ఇండియాతో జరగనున్న మ్యాచ్‌ను బాయ్ కాట్ చేసిన పాకిస్థాన్ చిక్కులో పడే అవకాశం కనిపిస్తుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై టీ20 ప్రపంచ కప్ అధికారిక ప్రసారకులు జియోస్టార్ నుంచి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని ఐసీసీ హెచ్చరించిందని పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు మంగళవారం (ఫిబ్రవరి 3) వెల్లడించాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు కొలంబో మ్యాచ్‌కు దూరంగా ఉండాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించుకుంది. అయితే పీసీబీ ఎందుకు తప్పుకుంటున్నారో ఇంకా అధికారికంగా ఐసీసీకి కారణాలను తెలపలేదు. 

ఇండియాతో పాకిస్తాన్ ఆడకపోతే వారు ఆర్థిక జరిమానాలను ఎదుర్కోవడమే కాకుండా.. ప్రసారకుల నుండి దావా వేసే అవకాశం కూడా ఉంటుంది. దానితో పాటు ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (DRC)కి వెళ్లే ప్రయత్నాలు కూడా విఫలమయ్యే అవకాశం ఉంది. ఐసీసీ వివాద పరిష్కార కమిటీ ఒక అంతర్గత ప్యానెల్. ఇది స్వంత బోర్డు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీళ్లను స్వీకరించదు. ఐసీసీ అన్ని ఐసీసీ ఈవెంట్ల కోసం బ్రాడ్‌కాస్టర్‌తో నాలుగు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసినప్పుడు.. ఈ ఒప్పందంలో పాకిస్తాన్, ఇండియా   మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. దాని ఆధారంగా ఐసీసీకి బ్రాడ్‌కాస్టర్ చెల్లింపులు చేసింది. కాబట్టి కాంట్రాక్టును తీవ్రంగా ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో పాటు ఐసీసీని కోర్టుకు తీసుకెళ్లే హక్కు బ్రాడ్‌కాస్టర్‌కు ఉంటుంది.

అసలేం జరిగిందంటే..? 

ఇటీవల ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా పరమైన కారణాలతో ఇండియాలో మ్యాచులు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. తమ మ్యాచులను ఇండియా బయట ఇతర వేదికల్లో నిర్వహించాలని ఐసీసీని కోరింది. కానీ అప్పటికే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్ కావడంతో బంగ్లా అభ్యర్థనను ఐసీసీ రిజెక్ట్ చేసింది. 

Also Read : వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్

దీంతో బంగ్లా వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది. ఆ జట్టు స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్‎కు అవకాశం కల్పించింది. అయితే.. బంగ్లాదేశ్‎కు మద్దతుగా పాకిస్తాన్ కూడా టీ20 వరల్డ్ కప్‎ను బాయ్ కాట్ చేయాలని భావించింది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం, ఆ దేశ క్రికెట్ బోర్డు చర్చలు జరిపాయి. చివరకు టీ20 వరల్డ్ కప్ పాల్గొనేందుకు పాకిస్తాన్ టీమ్‎కు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

 కానీ ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకోలేదు. దీంతో పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‎లో పార్టిసిపేట్ చేస్తోంది కానీ ఇండియాతో మ్యాచ్ ఆడదు. మొత్తం టోర్నీని బహిష్కరిస్తే భారీగా ఆర్ధిక నష్టం వస్తుందనే భయంతోనే పాక్ ఈ జిత్తులమారి ప్లాన్ వేసినట్లు క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా, పాక్ లేకుంటే వరల్డ్ కప్ అంతా కిక్కు ఉండదంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.