ఇన్కమ్ టాక్స్ రీఫండ్ ఇంకా రాలేదా.. ఆలస్యానికి కారణం ఇదే..

ఇన్కమ్ టాక్స్ రీఫండ్ ఇంకా రాలేదా.. ఆలస్యానికి కారణం ఇదే..

ఆదాయపు పన్ను చట్టాల్లోని పరిమితులకు మించి సంపాదన కలిగిన ఉద్యోగులు ఇప్పటికే తమ వార్షిక పన్ను రిటర్న్స్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది తమ రీఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే రీఫండ్ ఆలస్యం కావటంతో కొందరు వేతనజీవులు ఆందోళనలో ఉన్న సంగతి తెలిసిందే. 

అయితే పన్ను చెల్లింపుదారులకు రీఫండ్స్ ఆలస్యాలపై సెంట్రల్ బోల్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ చైర్మన్ రవి అగర్వాల్ సోమవారం స్పందించారు. కొన్ని రకాల రీఫండ్ క్లెయిమ్స్ మరీ ముఖ్యంగా అధిక విలువ కలిగిన ప్రత్యేక డిడక్షన్స్ అనాలసిస్ ఆలస్యాలే దీనికి కారణంగా వెల్లడించారు. వీటి ప్రత్యేక ప్రాసెసింగ్, పర్యవేక్షణ రీఫండ్స్ ఆలస్యాలకు కారణమైందని.. డిసెంబర్ నాటికి సజావుగా ఉన్న రీఫండ్ క్లెయిమ్స్ ప్రాసెసింగ్ జరుగుతుందని అగర్వాల్ అన్నారు. 

అలాగే ఏవైనా ఫైలింగ్ సమయంలో చూపటం మర్చిపోయిన పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపినట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో తక్కువ విలువ కలిగిన రీఫండ్ క్లెయిమ్స్ వేగంగా ప్రాసెస్ చేసి డబ్బు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తన పరిశీలనలో కొందరు టాక్స్ పేయర్స్ తప్పుడు క్లెయిమ్స్ చేసినట్లు బయటపడిందని చెప్పారు. అధికారిక డేటా ప్రకారం ఏప్రిల్ 1- నవంబర్ 10 మధ్య రీఫండ్ జారీలు దాదాపు 18 శాతం తగ్గి రూ.2.42 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 

అలాగే డైరెక్ట్ టాక్సెస్ సంబంధించిన లిటిగేషన్స్ తగ్గించడానికి తీసుకున్న చర్యలను కూడా అగర్వాల్ హైలైట్ చేశారు. తమ అధికారులు ఇప్పటికే ఓవర్ టైం పనిచేస్తున్నారని అగర్వాల్ వెల్లడించారు. నిజమైన పన్ను చెల్లింపుదారులకు సజావుగా తిరిగి చెల్లింపు ప్రక్రియలు జరిగేలా చూస్తున్నట్లు చెప్పారు.