T20 World Cup: సౌతాఫ్రికా ఘన విజయం.. టోర్నీ నుంచి జింబాబ్వే ఔట్

T20 World Cup: సౌతాఫ్రికా ఘన విజయం.. టోర్నీ నుంచి జింబాబ్వే ఔట్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఏకంగా 5 వికెట్ల తేడాతో పసికూన జింబాబ్వేను సఫరీ టీమ్ ఓడించింది. టాస్ గెలిచిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులు మాత్రమే చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో తడివానాషే మారుమణి (7), బ్రియాన్ బెన్నెట్ (15), డియోన్ మైయర్స్ ( 11), ర్యాన్ బర్ల్ (5), టోనీ మునియోంగా (2), బ్రాడ్ ఎవాన్స్ 8), వెల్లింగ్టన్ మసకద్జా (1) దారుణంగా విఫలమైనప్పటికీ.. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఒక్కడే ఒంటరి పోరాటం కొనసాగించాడు. 43 బంతుల్లో  8 ఫోర్లు, 4 సిక్సులతో 73 పరుగులు చేయగా, చివర్లో  క్లైవ్ మదాండే కూడా 20 బంతుల్లో 3 ఫోర్లలో 26 పరుగులు చేసి క్రీజులో అజేయంగా నిలిచాడు. 

154 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సఫరీ జట్టు ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (0) డకౌట్ కాగా, ఐడెన్ మార్క్రామ్ (4) సింగిల్ డిజిట్ పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో 14 పరుగులకే కీలకమైన రెండు వికెట్లు నష్టపోయి ఇబ్బందుల్లో పడిన ప్రోటీస్ జట్టును ర్యాన్ రికెల్టన్ (22 బంతుల్లో 4 సిక్సులతో 31 పరుగులు), డెవాల్డ్ బ్రెవిస్ ( 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 42 పరుగులు) జస్ట్ మిస్ లో హాఫ్ సెంచరీని చేజార్చుకోగా, డేవిడ్ మిల్లర్ ( 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 22 పరుగులు) ఆదుకునే ప్రయత్నం చేసి ఔట్ అయ్యారు.

 అనంతరం క్రీజులోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ ( 23 బంతుల్లో 19  పరుగులు ), జార్జ్ లిండే ( 21  బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 30 పరుగులు ) చివర్లో మెరుపు బ్యాటింగ్ చేసి అజేంయగా నిలిచి సౌతాఫ్రికా జట్టుకి విజయాన్ని అందజేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా కీలకమైన 3 వికెట్లు తీసుకుని ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి సఫరీ జట్టు బ్యాటర్లను వణికించగా, బ్లెస్సింగ్ ముజారబానీ, బ్రాడ్ ఎవాన్స్ తలో వికెట్ పడగొట్టారు.