ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‎స్టర్ అన్మోల్ బిష్ణోయ్‎ను దేశం నుంచి బహిష్కరించిన అమెరికా

ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‎స్టర్ అన్మోల్ బిష్ణోయ్‎ను దేశం నుంచి బహిష్కరించిన అమెరికా

న్యూఢిల్లీ: ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‎ను అమెరికా బహిష్కరించింది. ఈ మేరకు యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటన చేసింది. ట్రంప్ ప్రభుత్వం నవంబర్ 18న అన్మోల్ బిష్ణోయ్‌ను అధికారికంగా అమెరికా నుండి బహిష్కరించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. అన్మోల్‎పై అమెరికా బహిష్కరణ వేటు వేయడంతో అతడిని ఇండియా తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడైన అన్మోల్ బిష్ణోయ్‎ ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. తన సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉండటంతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలను అన్మోలే నడిపిస్తున్నాడు. ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ, పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసుల్లో అన్మోల్ నిందితుడు. అలాగే.. బాలీవుడ్ స్టార్ట్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో కూడా అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అన్మోల్ ఒకడు. అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. 

►ALSO READ | ప్రపంచవ్యాప్తంగా X , ChatGPT డౌన్: లక్షలాది వెబ్ సైట్ సేవల్లో అంతరాయం

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అన్మోల్ అక్కడి నుంచే ఇండియాలో నేరాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. అతడిని ఇండియా తీసుకొచ్చేందుకు భారత ఏజెన్సీలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో 2025, ఫిబ్రవరిలో అన్మోల్ అమెరికాలో అరెస్టు అయ్యాడు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగం అతడిని పట్టుకుంది.

 తాజాగా అన్మోల్‎పై అమెరికా దేశ బహిష్కరణ వేటు వేసింది. దీంతో అతడిని ఇండియా తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. త్వరలోనే భారత ఏజెన్సీలు అన్మోల్‎ను ఇండియాకు తీసుకురానున్నాయి. అన్మోల్ బిష్ణోయ్‌పై అమెరికా బహిష్కరణ వేటు వేయడం ఢిల్లీ, పంజాబ్, ముంబై, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాల్లోని కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు బలగాలకు ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు.