న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్), AI చాట్‌బాట్ ChatGPTతో పాటు పలు వైబ్ సైట్ సేవలు నిలిచిపోయాయి. సీడీఎన్ సర్వీస్‌ల ప్రొవైడర్ క్లౌడ్‌ఫ్లేర్‌లో సమస్య కారణంగా మంగళవారం (నవంబర్ 18) సాయంత్రం 5:15 గంటల నుంచి వివిధ వెబ్ సైట్లు, యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు వెబ్ సైట్లను యాక్సెస్ చేయలేకపోతున్నారు.
లాగిన్, సైన్ అప్ , పోస్టింగ్ వంటి సేవలు పొందలేకపోతున్నామని ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు యూజర్లు. వెబ్‌సైట్లు లేదా యాప్‌లను తెరవడానికి ప్రయత్నించగా.. స్క్రీన్‌పై 'ఎర్రర్ కోడ్ 500' లేదా 'ఎర్రర్ 522' (కనెక్షన్ టైమ్డ్ అవుట్) వంటి సందేశాలు దర్శనమిస్తున్నాయని పేర్కొంటున్నారు.
వేలాది మంది యూజర్లు తమ సమస్యలను డౌన్‌డిటెక్టర్ వంటి ఔట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్లలో నివేదించారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎక్స్ (ట్విట్టర్) యూజర్లు వెబ్, యాప్ వెర్షన్‌లలో పోస్ట్‌లను యాక్సెస్ చేయడంలో, రిఫ్రెష్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. దాదాపు 43% మంది పోస్ట్‌లను వీక్షించడంలో సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. 23% మంది వెబ్‌సైట్‌ను ఉపయోగించడంలో ప్రాబ్లమ్ ఉందని తెలిపారు. 24% మంది వెబ్ కనెక్షన్‌తో సమస్యలు ఉన్నాయని నివేదించారు.
సీడీఎన్ సర్వీస్‌ల ప్రొవైడర్ క్లౌడ్‌ఫ్లేర్‌లో అంతరాయం కారణంగా ఈ సమస్య తలెత్తింది. క్లౌడ్‌ఫ్లేర్ అనేది వెబ్‌సైట్‌లు, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం సాంకేతిక సేవలను అందించే ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల ప్లాట్‌ఫామ్. క్లౌడ్‌ఫ్లేర్‌లో గ్లిచ్ కారణంగా ఎక్స్, చాట్‌జీపీటీతో పాటు దీనిపై ఆధారపడిన దాదాపు ఏడున్నర లక్షల వెబ్ సైట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యపై క్లౌడ్‌ఫ్లేర్ స్పందించింది. సమస్యను గుర్తించామని.. మా బృందం సమస్యను పునరుద్ధరించేందుకు కృషి చేస్తోందని వెల్లడించింది.
