సినీ ఇండస్ట్రీలో కొందరు నటీమణులు స్టార్ హీరోయిన్స్ గా ఓ వెలుగు వెలిగిపోతారు. కానీ కొన్ని అనుకోని సంఘటనలతో వారి వెండితెర ప్రయాణం ఒక్కసారిగా ముగుస్తుంది. అలాంటి వారిలో గిరిజా శెట్టర్ ఒకరు. తొలి రోజుల్లో ఆమె సినీ ప్రస్థానం ఒక అద్భుమైనదిగా నిలిచింది. ఎంట్రీ చిత్రంతోనే రికార్డు సృష్టించింది. కానీ విధి ఆమెను దాదాపు మూడు దశాబ్దాల పాటు వెండితెర నుంచి దూరం చేసింది.
'గీతాంజలి'తో సంచలనం
గిరిజా శెట్టర్ సినీ రంగ ప్రవేశం ఒక తుఫానులా సాగింది. ఆమె 1989లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన రొమాంటిక్ క్లాసిక్ చిత్రం 'గీతాంజలి' ద్వారా అక్కినేని నాగార్జున సరసన పరిచయమైంది. ఈ చిత్రం 100 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. తెలుగు రొమాంటిక్ చిత్రాల జానర్‌ను సరికొత్తగా నిర్వచించింది. ఈ సినిమాతో గిరిజా రాత్రికి రాత్రే సంచలనంగా మారిపోయింది. ఆ సినిమాలో ఆమె పోషించిన ఉల్లాసభరితమైన, ఆధునిక, స్వేచ్ఛాయుత పాత్ర ఆ కాలపు హీరోయిన్ల పాత్రలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 'ఓ పాపా లాలీ' వంటి పాటల్లో ఆమె ప్రదర్శించిన నిష్కల్మషమైన ప్రేమ, ఉల్లాసం యువతను ఉర్రూతలూగించింది.
అంతేకాదు, గిరిజా మలయాళంలోనూ వెంటనే అభిమానులను సంపాదించుకుంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ సరసన నటించిన హిట్ చిత్రం 'వందనం'లో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రంలో ఆమె చెప్పే ఐకానిక్ డైలాగ్ "ఎన్కిలే ఎన్నోడ్ పర ఐ లవ్ యూ ఎన్న్..." ఈనాటికీ మలయాళ సినీ ప్రియుల మనసుల్లో బలంగా నాటుకుపోయింది.
చేజారిన బాలీవుడ్ కల..
గిరిజ తన తదుపరి చిత్రం బాలీవుడ్ లోకి ఎంట్రీ. కల్ట్ స్టేటస్ పొందడానికి సిద్ధంగా ఉన్న 'జో జీతా వోహి సికిందర్' చిత్రంలో ఆమె అమీర్ ఖాన్ సరసన ఎంపికైంది. కానీ, మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఆమె లండన్‌కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో, దర్శకుడు మన్సూర్ ఖాన్ మొత్తం తారాగణంలో చాలా మందిని మార్చవలసి వచ్చింది.. ఆమె స్థానంలో ఆయేషా జుల్కాను తీసుకున్నారని గతంలో వెల్లడించారు.
అనిశ్చితి వైపు ప్రయాణం..
గిరిజ నటించిన సన్నివేశాలకు సంబంధించి కేవలం 'అరే యారో' పాటలో కొన్ని ఫ్లీటింగ్ షాట్స్ మాత్రమే మిగిలాయి. అయితే తన అద్భుతమైన కెరీర్‌కు ఆ షాట్స్ ఒక చిన్న జ్ఞాపకంగా చివరికి మిగిలాయి. అలా బాలీవుడ్ సినిమాను వదులుకోవాల్చి వచ్చింది. అదే సమయంలో, మోహన్‌లాల్‌తో కలిసి నటించిన ఆమె మలయాళ చిత్రం 'ధనుష్కోడి' ఆర్థిక సమస్యల కారణంగా నిర్మాణంలో ఉన్నప్పుడే అర్ధాంతరంగా ఆగిపోయింది. అద్భుతంగా ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం ఒక్కసారిగా అనిశ్చితి వైపు మళ్లింది.
30 ఏళ్ల నిరీక్షణ!
తీవ్ర నిరాశకు గురైన గిరిజా శెట్టర్ పూర్తిగా భారతదేశాన్ని వదిలి వెళ్లిపోయింది. భారతీయ చిత్రాలను చూస్తే తనలో విచారం, పశ్చాత్తాపం కలుగుతాయని భయపడి చాలా సంవత్సరాలు వాటిని చూడడం మానేశానని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె నటించిన రెండవ తెలుగు చిత్రం, 'హృదయాంజలి', ఆమె ఇండస్ట్రీ నుంచి పూర్తిగా వైదొలిగిన పదేళ్ల తర్వాత, అంటే 2002లో మాత్రమే విడుదలైంది. దాదాపు మూడు దశాబ్దాల విరామం తర్వాత.. గిరిజా శెట్టర్ 2024లో కన్నడ చిత్రం 'ఇబ్బని తబ్బిద ఇలేయాలి' తో వెండితెరపైకి తిరిగి వచ్చింది. కేవలం కొద్ది సినిమాలతోనే తనదైన ముద్ర వేసిన గిరిజా శెట్టర్.. ప్రతిభకు అదృష్టం తోడై ఉంటే, నేడు దక్షిణాది సినీ చరిత్రలో ఆమె ఒక అత్యంత ఆగ్ర తారగా వెలిగి ఉండేది అనడంలో సందేహం లేదంటున్నారు సినీ విశ్లేషకులు.
