ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు తర్వాత నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం (నవంబర్ 17) భేటీ అయిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం (సెప్టెంబర్ 17) సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో లోకల్ బాడీ ఎలక్షన్స్, గిగ్ వర్కర్ల బిల్లుతో పాటు పలు అంశాలపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేబినెట్ భేటీ అనంతరం మంత్రిమండలి నిర్ణయాలను మంత్రులు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. కానీ రాష్ట్రపతి దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్లు ఆగిపోయిందని గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో భావించామన్నారు.  

కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మిగిలిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్ని కూడా రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు తర్వాత నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు. గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన చోట స్మృతివనం ఏర్పాటు చేయడంతో పాటు ఆయన కుమారుడికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు.